ప్రతీ ఒక్కరి ఇంట్లో నిత్యావసర వస్తువులుగా ఉండే లిస్టులో గ్యాస్ సిలిండర్ ఒకటి కచ్చితంగా ఉంటుంది. గ్యాస్ సిలిండర్ ధరలు అంతర్జాతీయ ముడి చమురు ధరలపై ఆధారపడి ఉండటంతో.. ఈ ధరలను ప్రతీ నెల ఒకటో తేదీన సవరిస్తుంటారు. అందుకే ప్రతి నెలా 1 వ తేదీ రాగానే ధరలు తగ్గుతాయేమోనని సామాన్యులు ఆశగా ఎదురుచూస్తారు. అయితే ఈ కొత్త సంవత్సరం 2025 మొదటి రోజునే ఆయిల్ కంపెనీలు సామాన్యుల కోసం ఓ శుభవార్తను ప్రకటించాయి. ప్రభుత్వ చమురు కంపెనీలు ఈ రోజు నుంచి ఎల్‌పిజి సిలిండర్ల ధరలను రూ.14.50 తగ్గించాయి. అయితే ఈ తగ్గింపు 14 కిలోల గ్యాస్ సిలిండర్ కు వర్తించదు. కేవలం 19కిలోల కమర్షియల్ సిలిండర్ కే వర్తిస్తుంది.
జనవరి 1, 2025 నుండి ఢిల్లీలో 19 కిలోల ఎల్‌పీజీ సిలిండర్‌ను రీఫిల్ చేయడానికి ప్రస్తుతం రూ. 1804 చెల్లించాల్సి ఉంటుంది, అయితే అంతకుముందు ఈ సిలిండర్ కోసం రూ. 1818.50 చెల్లించాల్సి ఉండేది. కోల్‌కతాలో ధరలు కూడా రూ.1911కి తగ్గాయి, దీనికి ముందు వినియోగదారులు రూ.1927 చెల్లించాల్సి వచ్చేది. ముంబైలో ధర రూ.1756కి తగ్గింది, దీనికి ముందుగా వినియోగదారులు రూ.1771 చెల్లించాల్సి వచ్చేది. చెన్నైలో రూ. 1966 చెల్లించాలి, దీనికి ముందు వినియోగదారులు రూ. 1980.50 చెల్లించాల్సి వచ్చేది.
బీహార్ రాజధాని పాట్నాలో 19 కిలోల కమర్షియల్ ఎల్‌పిజి సిలిండర్‌ను రీఫిల్ చేయడానికి రూ.2095.5 చెల్లించాలి. ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో రూ.1925, నోయిడాలోని గౌతమ్‌బుద్ధనగర్‌లో రూ.1802.50 చెల్లించాలి. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో 19 కిలోల ఎల్‌పిజి కమర్షియల్ సిలిండర్‌ను రీఫిల్ చేయడానికి జనవరి 1, 2025 నుంచి రూ. 2073, జార్ఖండ్ రాజధాని రాంచీలో రూ. 1962.50 చెల్లించాల్సి ఉంటుంది. హైదరాబాద్ లో మాత్రం కమర్షియల్ సిలిండర్ ధర రూ.2030గా ఉంది. దీంతో ఇప్పుడు హోటల్, రెస్టారెంట్లలో ఫుడ్ తినే వినియోగదారుడి జేబుకు కాస్త భారం తగ్గుతుంది. ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ చేసిన వాళ్లు కూడా ఉపశమనం పొందవచ్చు.