మహా పర్వంగా జరగనున్న కుంభమేళా

Kumbh Mela To Be Held As A Grand Festival, A Grand Festival, Kumbh Mela, Kumbh Mela A Grand Festival, Maha Kumbh Mela Prayagraj 2025, Maha Kumbh Mela 2025,Ganga, Godavari, Kaveri, Prayagraj, Tungabhadra, Yamuna, India, National News, Live Updates, Breaking News, Headlines, Live News, Mango News, Mango News Telugu

ప్రయాగ్‌రాజ్‌లో జనవరి 13వ తేదీ నుంచి ప్రారంభమయ్యే మహాకుంభ మేళాకు యూపీ సర్కారు కనీవినీ ఎరుగని ఏర్పాట్లు చేస్తోంది. ప్రపంచస్థాయి మహా పర్వంగా ఈ కుంభమేళాను నిర్వహించేందుకు 7,500 కోట్ల ఖర్చుతో శరవేగంగా ఏర్పాట్లు చేస్తోంది. దేశవ్యాప్తంగానే కాకుండా పలు దేశాల నుంచి కూడా భక్తులు వస్తారన్న అంచనాలతో ఏర్పాట్లను కూడా అదే స్థాయిలో చేస్తున్నారు.

మతపరమైన కార్యక్రమాల్లో మహాకుంభమేళా ప్రపంచంలో అతి పెద్దదని అధికారులు చెబుతున్నారు. యూపీ ప్రభుత్వ అంచనాల మేరకు సుమారు 40 కోట్ల మంది భక్తులు పవిత్ర సంగమంలో స్నానం చేయనున్నారు. దీనికి తగిన విధంగానే ఏర్పాట్లు కూడా సాగుతున్నాయి. మహాకుంభమేళా పుష్య పౌర్ణమి తిథినాడు.. అంటే జనవరి 13న ప్రారంభం కానుంది. ఏకంగా 45 రోజుల పాటు కొనసాగిన తర్వాత ఫిబ్రవరి 26న ముగియనుంది. తొలి పవిత్ర స్నానాలు మకర సంక్రాంతి రోజు ప్రారంభంకానున్నాయి.

రోడ్లు వెడల్పు నుంచి సంగమ ఘాట్ల సుందరీకరణ వరకు అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. మొత్తం ప్రభుత్వ యంత్రాంగమంతా మహా కుంభమేళా నిర్వహణను అత్యంత ప్రతిష్ఠాత్మకం భావిస్తున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తన మన్‌కీ బాత్‌లో మహాకుంభ మేళాను.. ఐక్యతా మహాకుంభ్‌గా అభివర్ణించారు. ప్రతి ఒక్కరూ ఐక్యతా మహాకుంభ్‌కు తరలి రావాలని మోదీ పిలుపునిచ్చారు. మహాకుంభ్‌ సందేశం.. యావత్‌ దేశాన్నీ ఐక్యంగా ఉంచడమే అని తేల్చి చెప్పారు. అటు మహా కుంభమేళాకు విచ్చేసే భక్తులకు ప్రత్యేక అనుభూతిని అందించేందుకు యూపీ ప్రభుత్వం 2వేలకు పైగా డ్రోన్లతో భారీ డ్రోన్‌ షోను కూడా ఏర్పాటు చేస్తోంది.

అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి చేసిన ఏర్పాట్లను మించి మహాకుంభ మేళాకు ఇప్పుడు ఏర్పాట్లు జరుగుతున్నాయి. 2019లో కుంభమేళాకు చేసిన ఏర్పాట్ల కంటే రెట్టింపు ఏర్పాట్లను చేస్తున్నారు. మహాకుంభమేళాను హరిత మేళాగా నిర్వహించేలా…..పూల మొక్కలతో సంగమ ప్రాంతాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. మొత్తంగా 3 లక్షల మొక్కలను ఇక్కడ నాటుతున్నారు. అదేవిధంగా 12 కిలోమీటర్ల మేర అతిపెద్ద ఘాట్‌ను నిర్మిస్తున్నారు. సంగమ ప్రాంతంలోని లక్షా 50 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో రామాయణ, మహాభారతాల్లోని పలు అంశాలతో కూడిన కుడ్య చిత్రాలు, తైలవర్ణ చిత్రాలను ఏర్పాటు చేస్తున్నారు.

మహాకుంభమేళాకు కట్టుదిట్టమైన భద్రత కల్పిస్తున్నారు. మొత్తంగా ఏడంచల్లో భద్రతా ఏర్పాట్లు చేశారు. స్థానిక పోలీసులు 13 తాత్కాలిక పోలీసు స్టేషన్లను ఏర్పాటు చేశారు. దీంతో మొత్తం స్టేషన్ల సంఖ్య 57కు చేరింది. మహాకుంభమేళా జరిగే జిల్లాలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాలు సహా విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్‌, బస్టాండ్ల వద్ద 23 తనిఖీ కేంద్రాలను ఏర్పాటు చేశారు. సాయుధ కానిస్టేబుళ్లు, 4 జాతీయ విపత్తు దళాలను, 21 కంపెనీల కేంద్ర సాయుధ పోలీసు బలగాలను మోహరిస్తున్నారు. రాష్ట్ర పోలీసులే 10 వేల మంది భద్రతా విధుల్లో ఉండనున్నారు.

మహా కుంభమేళాలో ఎటువంటి ప్రమాదాలు జరగకుండా రోబోటిక్‌ ఫైర్‌ టెండర్లను ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఎమర్జెన్సీ సమయాల్లో ఫైర్ సిబ్బంది వెళ్లలేని ప్రాంతాలకు వెళ్లి.. బాధితులను రక్షించేందుకు రోబోటిక్‌ ఫైర్‌ టెండర్లను ఉపయోగించనున్నట్లు తెలిపారు.
మరోవైపు ఆర్టిక్యూలేటింగ్‌ వాటర్‌ టవర్‌లు.. అత్యాధునిక టెక్నాలజీ కలిగిన సీసీ కెమెరాలను కూడా మహా కుంభమేళాలో ఏర్పాటు చేయనున్నారు. ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ తరహాలో ప్రత్యేక శిక్షణ తీసుకున్న ఎస్‌టీఆర్‌జీని హై రిస్క్‌ జోన్‌ ప్రాంతాల్లో మోహరించనున్నారు. ఇక మహా కుంభమేళాలో అగ్నిమాపక సేవల కోసం 67 కోట్లు ఖర్చు చేయనున్నారు . ఉత్తరప్రదేశ్ లో జరిగే మహా కుంభమేళాకు భారతీయ రైల్వే కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది.