నూతన సంవత్సరంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయంలో జరిగిన కేబినెట్ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ కేబినెట్ పలు కీలక అంశాలను ఆమోదించింది. మొత్తం 14 అంశాలపై చర్చ జరిపిన కేబినెట్, వాటికి అనుమతి ఇచ్చింది. జనవరి 8వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ పర్యటనకు రానున్నారు. ఈ సందర్భంగా విశాఖపట్నంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. ప్రధాని పర్యటనను విజయవంతం చేయడం కోసం మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక దిశానిర్దేశం ఇచ్చారు.
ఏపీ కేబినెట్‌లో 14 కీలక నిర్ణయాలు
అమ్మ ఒడి పునఃప్రారంభం: వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి అమ్మ ఒడి పథకానికి గ్రీన్ సిగ్నల్.
రైతులకు మద్దతు:కేంద్రం ఇస్తున్న రూ.10 వేల సాయంతో పాటు, ఏపీ ప్రభుత్వం అదనంగా మరో రూ.10 వేలు అందజేయనున్నది.
మత్స్యకారుల కోసం: ఫిషింగ్ హాలిడే సమయంలో మత్స్యకారులకు రూ.20 వేలు ఆర్థిక సాయం.
అమరావతిలో అభివృద్ధి ప్రాజెక్టులు: రాజధాని అమరావతిలో రూ.2,733 కోట్ల పనులకు కేబినెట్ ఆమోదం. ఇంజినీరింగ్ కాలేజీలకు అనుమతులు.
హెల్త్ సెక్టార్ అభివృద్ధి: తిరుపతి ఈఎస్‌ఐ ఆస్పత్రిని 50 నుంచి 100 పడకల సామర్థ్యానికి పెంపు.
గుంటూరు జిల్లాలో 100 పడకల ఆసుపత్రి నిర్మాణానికి స్థలం కేటాయింపు.
పెట్టుబడులు: రూ.1,82,162 కోట్ల పెట్టుబడులకు కేబినెట్ ఆమోదం. రామయ్యపట్నంలో రూ.96,862 కోట్లతో బీపీసీఎల్ భారీ రిఫైనరీకి గ్రీన్ సిగ్నల్. క్లీన్ ఎనర్జీ ప్రాజెక్టులకు రూ.83 వేల కోట్ల పెట్టుబడులు.
విశాఖపట్నం అభివృద్ధి: మిలీనియం టవర్స్‌లో టీసీఎస్ రూ.80 కోట్ల పెట్టుబడులతో విస్తరణ.
వాహన తయారీ పరిశ్రమలు: గుడిపల్లిలో ఆజాద్ మొబిలిటీ రూ.1,046 కోట్లతో ఎలక్ట్రిక్ వాహన తయారీ యూనిట్. అనకాపల్లిలో బాలాజీ యాక్షన్ బిల్డ్‌వెల్ సంస్థ రూ.1,174 కోట్ల పెట్టుబడులు.
ప్రధాని మోదీ పర్యటన: జనవరి 8న ప్రధాని మోదీ వైజాగ్ పర్యటనలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన.
నదుల అనుసంధానం: గోదావరి-బనకచర్ల ప్రాజెక్ట్‌పై చర్చ.