అమెరికాలో ప్రస్తుతం కొనసాగుతున్న హెచ్ 1-బి వీసా విధానంపై యూఎస్‌లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. జనవరి 20న అమెరికా అధ్యక్షుడిగా మరోసారి బాధ్యతలు చేపట్టనున్న డొనాల్డ్ ట్రంప్ ..హెచ్ 1 బీ వీసా విధానంలో పలు సంచలన సంస్కరణలు తీసుకురానున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఎలాన్ మస్క్, వివేక్ రామస్వామి వంటివారు హెచ్-1బీ పొడిగింపును సమర్థిస్తుండగా, స్టీవ్ బానన్, నిక్కీ హేలీ, లారా లూమర్ వంటి వారు వ్యతిరేకిస్తున్నారు.
అమెరికాలోని సంస్థలు కీలక పదవుల్లో విదేశీ ఉద్యోగులను నియమించుకోవడానికి అనుమతించే హెచ్-1 బీ ప్రోగ్రామ్ గురించి యూఎస్ లో పెద్ద చర్చ ప్రారంభమైంది. కొత్తగా ఏర్పాటు చేసిన డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ సహనాయకులుగా ట్రంప్ నామినేట్ చేసిన మస్క్ , రామస్వామితోపాటు పలువురు హెచ్ 1 బీ వీసా విధానాన్ని విస్తరించాలని డిమాండ్ చేస్తున్నారు.
అయితే గతంలో హెచ్ 1బీ వీసాను వ్యతిరేకించిన ట్రంప్ ప్రస్తుతం దానికి మద్దతు తెలిపారు. ప్రస్తుత వివాదానికి ముగింపు పలకడానికి మద్దతిస్తున్నట్టు తెలిపారా..? లేక తన వైఖరిని మార్చుకున్నారా..? అనేది ఎవరికీ అంతుచిక్కడం లేదు. దీంతో ట్రంప్ ప్రమాణం తర్వాత వీసాపై ఇదే అభిప్రాయాన్ని కొనసాగిస్తారా..? లేక అక్రమ వలసదారులపై ఉక్కుపాదం తప్పదని చాలా మార్లు హెచ్చరించిన ట్రంప్ మరేదైనా సంచలన నిర్ణయం తీసుకుంటారా అనే ఆసక్తి నెలకొంది.
హెచ్-1బీ వీసా అనేది నాన్-ఇమ్మిగ్రెంట్ వీసా, ఇది ప్రత్యేక సాంకేతిక నైపుణ్యాలు అవసరమయ్యే స్థానాలకు విదేశీ నిపుణులను నియమించుకోవడానికి అమెరికన్ కంపెనీలను అనుమతిస్తుంది. ఈ వీసా ద్వారా టెక్నాలజీ రంగంలోని కంపెనీలు భారత్, చైనా వంటి దేశాల నుంచి ఏటా వేలాది మంది ఉద్యోగులను రిక్రూట్ చేసుకుంటాయి. ఐటీ , ఆర్కిటెక్చర్, ఆరోగ్య రంగాల్లోని నిపుణులు మాత్రమే ఈ వీసాను పొందగలరు.
అయితే లారా లూమర్, మాట్ గేట్జ్, ఆన్ కౌల్టర్ వంటి ట్రంప్ మద్దతుదారులు ఈ వీసాను వ్యతిరేకిస్తున్నారు. హెచ్-1బీ వీసా వల్ల విదేశీయులకు అమెరికాలో ఉద్యోగాలు వస్తాయని, యూఎస్ ప్రజలు తమ ఉద్యోగాలను కోల్పోతారని చెబుతున్నారు. కానీ ఎలాన్ మస్క్, వివేక్ రామస్వామి హెచ్-1బీ వీసాకు మద్దతు పలికారు. అమెరికాను ఆర్థికంగా బలోపేతం చేయడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుందని, చాలా కంపెనీలు అభివృద్ధి చెందటానికి హెచ్-1బీ వీసాదారులే కారణమని తమ వాదన వినిపిస్తున్నారు.
మరోవైపు అమెరికాలో పని అనుభవాన్ని పొందడానికి విదేశీ విద్యార్థులను అనుమతించే ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ప్రోగ్రాంపై కూడా క్రమంగా వ్యతిరేకత పెరుగుతోంది. ఈ కార్యక్రమంపై మేక్ అమెరికా గ్రేట్ అగైన్ నేటివిస్టులు తీవ్ర నిరసన తెలుపుతున్నారు. ఓపీటీని రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ప్రభావం భారతీయ విద్యార్థులపైనే ఎక్కువగా పడనుందని విశ్లేషకులు చెబుతున్నారు.