తెలంగాణ రాష్ట్రంలో రైతులకు, భూమిలేని పేద కుటుంబాలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ మేరకు వ్యవసాయ యోగ్యమైన భూములకు ‘రైతు భరోసా’ పథకం కింద ప్రతీ ఎకరానికి రూ.12 వేల పెట్టుబడి సాయం అందించనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఇదే కాకుండా భూమి లేని వ్యవసాయ కూలీలకు ‘ఇందిరమ్మ ఆత్మీయ భరోసా’ పేరుతో ఏటా రూ.12 వేల ఆర్థిక సాయం అందించనున్నట్లు వెల్లడించారు.
రైతు భరోసా పథకం:
గత ప్రభుత్వం ప్రతీ ఎకరానికి రూ.10 వేల పెట్టుబడి సాయం అందించినప్పటికీ, ప్రస్తుత ప్రభుత్వం దీనిని రూ.12 వేలుగా పెంచింది. వ్యవసాయ యోగ్యమైన ప్రతీ ఎకరానికి ఈ పథకం వర్తిస్తుంది.
అయితే, రాళ్లు, రప్పలు, గుట్టలు, మైనింగ్ భూములు, రియల్ ఎస్టేట్ వెంచర్లు, పరిశ్రమల కోసం ప్రభుత్వం సేకరించిన భూములకు ఈ పథకం వర్తించదని సీఎం స్పష్టం చేశారు.
ఇందిరమ్మ ఆత్మీయ భరోసా:
భూమిలేని వ్యవసాయ కుటుంబాలకు ఏటా రూ.12 వేల ఆర్థిక సాయం అందించనున్నట్లు సీఎం ప్రకటించారు. ఈ పథకాన్ని ప్రత్యేకంగా గ్రామసభల ద్వారా ప్రజలకు వివరించనున్నారు.
కొత్త రేషన్ కార్డులు:
రాష్ట్రంలో రేషన్ కార్డులు లేనివారికి కొత్త రేషన్ కార్డులు అందించాలని కేబినెట్ నిర్ణయించింది.
జనవరి 26న గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ పథకాలను ప్రారంభిస్తామని సీఎం తెలిపారు.
ఇతర కీలక నిర్ణయాలు: పంచాయతీ రాజ్ శాఖలో 588 కారుణ్య నియామకాలు. సింగూరు ప్రాజెక్టుకు మంత్రి దామోదర రాజనర్సింహ తండ్రి పేరు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు సూదిని జైపాల్ రెడ్డి పేరు. కొత్తగూడెం మున్సిపాలిటీని మున్సిపల్ కార్పొరేషన్‌గా అప్‌గ్రేడ్ చేయడం.
రైతుల పంటల పెట్టుబడులకు, భూమిలేని పేదలకు ఆర్థిక సాయం అందించాలన్న సంకల్పంతో ఈ పథకాలను చేపడుతున్నట్లు సీఎం రేవంత్ స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆదాయాన్ని పెంచి, పేదలకు పంచడం తమ విధానమని చెప్పారు.