తెలంగాణలో గురుకుల పాఠశాలల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు రోజురోజుకు తీవ్ర రూపం దాలుస్తున్నాయి. ఇటీవల కరీంనగర్ పట్టణంలోని శర్మనగర్ మహాత్మా జ్యోతిబాఫూలే గురుకుల పాఠశాలలో 30 మంది విద్యార్థినులు ఫుడ్ పాయిజన్‌తో అస్వస్థతకు గురయ్యారు. క్యాలీప్లవర్ కూర భోజనంగా పెట్టిన తర్వాత విద్యార్థినులు కడుపు నొప్పి, వాంతులు, విరేచనాలతో బాధపడ్డారు. దీంతో హుటాహుటిన వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఆసుపత్రి వర్గాల ప్రకారం, విద్యార్థినులు ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నప్పటికీ ఈ ఘటన తల్లిదండ్రుల్లో ఆందోళన కలిగించింది. ఫుడ్ పాయిజన్ కారణంగా విద్యార్థుల ఆరోగ్యం ప్రమాదంలో పడటానికి అధికారులు నిర్లక్ష్యమే ప్రధాన కారణమని వారు ఆరోపిస్తున్నారు.
ఈ ఘటనపై జిల్లా అధికారులు స్పందించి, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అదనపు కలెక్టర్ ప్రపుల్ దేశాయ్, ఇతర అధికారులు ఆసుపత్రిని సందర్శించి, విద్యార్థులతో మాట్లాడారు. తగిన చర్యలు తీసుకుంటామని వారు చెప్పారు.
ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం టాస్క్‌ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేసింది. ఆహార నాణ్యతపై పర్యవేక్షణతో పాటు ఫుడ్ పాయిజన్‌కు కారణాలను గుర్తించి బాధ్యులపై చర్యలు తీసుకోవడం టాస్క్‌ఫోర్స్ ముఖ్య ఉద్దేశ్యం.
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ ఈ ఘటనపై ఆరా తీశారు. గురుకులాల్లో భోజన నాణ్యత విషయంలో మరింత జాగ్రత్త వహించాలని, శుభ్రతపై రాజీపడొద్దని ఆయన సూచించారు. ఇక విద్యార్థి సంఘాలు, రాజకీయ నాయకులు కూడా పాఠశాల అధికారుల నిర్లక్ష్యాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. విద్యార్థుల ఆరోగ్యం పట్ల సరైన జాగ్రత్తలు తీసుకుంటే ఇలాంటి ఘటనలు ఎదురవేవని తల్లిదండ్రులు కోరుతున్నారు.