ట్రూడో రాజీనామాపై అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ఈ క్రమంలో ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. సొంత పార్టీ నేతల నుంచి అసమ్మతికితోడు.. ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో కెనడా ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో ప్రధాని పదవికి, లిబరల్ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ప్రధానిగా నూతన వ్యక్తి బాధ్యతలు చేపట్టే వరకు ప్రధాని పదవిలో కొనసాగుతానని, ఆ తరువాత పక్కకు తప్పుకుంటానని ట్రూడో స్పష్టం చేశారు. ట్రూడో రాజీనామాపై అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. తన సోషల్ మీడియా ప్లాట్ ఫాం ట్రూత్ సోషల్ లో ట్రంప్ పోస్టు చేశారు.
కెనడాలోని మెజార్టీ ప్రజలు అమెరికాలో 51వ రాష్ట్రంగా భాగస్వాములు అయ్యేందుకు ఇష్టపడుతున్నారని ట్రంప్ తెలిపారు. అమెరికాలో కలిస్తే కెనడియన్లకు ప్రయోజనం చేకూరుతుంది. కెనడాకు అధికంగా సబ్సిడీలు ఇచ్చి అమెరికా ఎక్కువ కాలం నష్టపోవాల్సిన అవసరం కూడా ఉండదు. ఈ విషయం జస్టిన్ ట్రూడోకు తెలుసు కాబట్టే ఆయన రాజీనామా చేశారు. కెనడా అమెరికాలో భాగమైతే ఎలాంటి సుంకాలు, పన్నులు ఉండవు. పైగా రష్యా, చైనా ఓడల నుంచి రక్షణ ఉంటుందంటూ ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్ ఫాం ట్రూత్ సోషల్‌లో తెలిపారు.
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ విజయం సాధించిన తరువాత.. కెనడా, మెక్సికోలపై 25శాతం సుంకం విధించనున్నట్లు ప్రకటించాడు. దీంతో జస్టిన్ ట్రూడో అమెరికాకు వెళ్లి.. డొనాల్డ్ ట్రంప్ తో భేటీ అయ్యారు. కెనడా నుంచి అమెరికాలోకి వలసలు, డ్రగ్స్ అక్రమ రవాణా అంశాలపై వీరిద్దరూ చర్చించారు. ఈ క్రమంలో వాటిని కట్టడి చేయలేని పక్షంలో కెనడా అమెరికాలో 51వ రాష్ట్రంగా చేరాల్సి ఉంటుందని ట్రూడోకు ట్రంప్ హెచ్చరికలు జారీ చేసినట్లు తెలిసింది. ట్రూడో రాజీనామాతో ప్రస్తుతం ట్రంప్ అదే విషయాన్ని ప్రస్తావించినట్లు తెలుస్తోంది.