సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన జిల్లా కలెక్టర్ల సమావేశం ఉత్కంఠ రేపుతోంది. ఈ సమావేశంలో ముఖ్యమైన పథకాలు, ముఖ్యంగా రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల పథకాలు అమలుపై కీలక చర్చ జరిగింది. జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ నాలుగు పథకాల అమలును ప్రతిష్టాత్మకంగా ప్రారంభించనున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు.
ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి తమ ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమైన విషయాలన్నవి సీఎం రేవంత్ పేర్కొన్నారు. ప్రతి పథకాన్ని క్షేత్ర స్థాయికి తీసుకెళ్లడం కలెక్టర్ల బాధ్యత అని స్పష్టం చేశారు. గ్రామ సభలు, మున్సిపాలిటీ వార్డు సభల నిర్వహణకు వెంటనే సన్నాహాలు చేయాలని కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చారు.
కలెక్టర్లకు ముఖ్యమంత్రి సూచనలు:
రైతు భరోసా పథకాన్ని ప్రతి అర్హ రైతుకు అందించాలి. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద భూమిలేని ఉపాధి కూలీలకు ఏడాదికి రూ.12 వేల నగదు సాయం అందించాలి. కొత్త రేషన్ కార్డులు జారీకి అర్హుల జాబితాను గ్రామ సభల్లో ప్రచురించాలి. గూడు లేని పేదల కోసం ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణం పూర్తి చేయాలి.
అకస్మిక తనిఖీల హెచ్చరిక:
జనవరి 26 తర్వాత జిల్లాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించనున్నట్లు సీఎం తెలిపారు. ప్రభుత్వ కార్యక్రమాల అమల్లో ఏ చిన్న నిర్లక్ష్యం కూడా సహించబోమని, అవసరమైతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
మహిళా అధికారులపై ప్రత్యేక దృష్టి:
మహిళా ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు నెలకు ఒక్కసారైనా బాలికల హాస్టల్స్ సందర్శించి, అక్కడే రాత్రి బస చేయాలని సీఎం ఆదేశించారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు ప్రజల వద్దకు చేరేలా చూడాలని సూచించారు.
చారిత్రాత్మక వేడుకలకు ప్రణాళిక:
భారత రాజ్యాంగ అమలుకు 75 సంవత్సరాలైనందున ఈ రిపబ్లిక్ డే వేడుకలను వైభవంగా నిర్వహిస్తామని సీఎం తెలిపారు. అదే రోజు నాలుగు ప్రతిష్టాత్మక పథకాలను ప్రారంభించడం రాష్ట్రానికి గర్వకారణమని అన్నారు.