ఆర్జీకర్ అత్యాచారం కేసు: కోర్టు సంచలన తీర్పు – ప్రధాన నిందితుడికి శిక్ష ఖరారు చేయనున్న కోర్టు..

రాజధాని కోల్‌కతాలోని ఆర్జీకర్ మెడికల్ కాలేజీ మరియు ఆస్పత్రిలో 2024 ఆగస్టు 9న జరిగిన అత్యాచారం, హత్య ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపింది. 31 ఏళ్ల జూనియర్ డాక్టర్‌పై పోలీస్ వాలంటీర్‌గా పనిచేస్తున్న సంజయ్ రాయ్ అత్యాచారం చేసి, హత్య చేసిన కేసులో కోల్‌కతా సీల్దా కోర్టు తాజాగా సంచలన తీర్పును వెలువరించింది.

జూనియర్ డాక్టర్‌పై అత్యాచారం, హత్య జరిగిన తర్వాత దేశవ్యాప్తంగా జూడాలు తీవ్ర నిరసనలు చేపట్టారు. బాధితురాలి తండ్రి, సీబీఐపై కీలక విమర్శలు చేశారు. సీబీఐ విచారణలో పారదర్శకత లేమి ఉందని, బాధిత కుటుంబానికి తగిన సమాచారం అందించలేదని వాపోయారు. సంజయ్ రాయ్‌ను సీసీటీవీ ఆధారంగా కోల్‌కతా పోలీసులు ఆగస్టు 10న అరెస్టు చేయగా, కోర్టుకు సమర్పించిన సీబీఐ ఛార్జిషీటులో ప్రధాన నిందితుడిగా అతని పేరు మాత్రమే చేర్చారు. అయితే సామూహిక అత్యాచార ఆరోపణలను ఛార్జిషీటులో ప్రస్తావించలేదు.

ఈ కేసులో ఆర్జీకర్ మెడికల్ కళాశాల మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్, తాలా పోలీస్ స్టేషన్ మాజీ ఇంఛార్జ్ అభిజిత్ మండల్‌పై సాక్ష్యాలను తారుమారు చేశారన్న ఆరోపణలతో అరెస్టులు జరిగాయి. అయితే ఛార్జిషీటు దాఖలులో జాప్యం కారణంగా, వారిద్దరికీ బెయిల్ మంజూరైంది. సీల్దా కోర్టు సంజయ్ రాయ్‌ను ప్రధాన నిందితుడిగా దోషిగా తేల్చింది. అతడికి శిక్షను 2025 జనవరి 22న ఖరారు చేయనున్నారు.

ఈ ఘటనపై విస్తృత నిరసనలు, న్యాయపరమైన ప్రక్రియలు, నిందితుల అరెస్టు, బాధిత కుటుంబ వేదనలు సమానంగా బయటపడ్డాయి. న్యాయ ప్రక్రియలో పారదర్శకత గురించి ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి.