భారత జట్టును ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం ప్రకటించారు. రోహిత్ శర్మ సారథ్యంలోని ఈ జట్టులో శుభ్‌మన్ గిల్‌ను వైస్ కెప్టెన్‌గా నియమించారు. మొత్తం 15 మంది సభ్యులతో కూడిన ఈ జట్టులో, నాలుగు మంది ఆటగాళ్లు తమ మొదటి ఐసీసీ వన్డే టోర్నమెంట్‌లో అరంగేట్రం చేయనున్నారు.
ఫాస్ట్ బౌలింగ్‌లో ప్రత్యేకమైన గుర్తింపు పొందిన అర్ష్‌దీప్ సింగ్‌కు ఈ టోర్నీలో అవకాశం దక్కింది. గతంలో వన్డే ప్రపంచకప్ 2023 జట్టులో స్థానం కోల్పోయిన అర్ష్‌దీప్, తన ఐసీసీ వన్డే అరంగేట్రాన్ని జరుపుకోవాలని ఆశిస్తోంది. ఇప్పటివరకు 8 వన్డేల్లో 12 వికెట్లు సాధించిన అతడు, తన ఫామ్‌ను నిరూపించుకోవాలని చూస్తున్నాడు.
స్పిన్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ కూడా ఈ టోర్నీలో ప్రధాన పాత్ర పోషించనున్నారు. ఇప్పటివరకు 22 వన్డేల్లో 23 వికెట్లు సాధించిన సుందర్, ఈ ఐసీసీ వన్డే టోర్నమెంట్ ద్వారా కొత్త అనుభవాలను సొంతం చేసుకోవాలని చూస్తున్నాడు.
అక్షర్ పటేల్, టీమిండియా తరఫున 60 వన్డేలు ఆడిన అనుభవం ఉన్నా, ఇప్పటి వరకు ఐసీసీ వన్డే టోర్నమెంట్‌లో ఆడలేదు. ఈసారి అతనికి అవకాశాలు దక్కే అవకాశం ఉంది. అలాగే, టీమిండియా భవిష్యత్ స్టార్‌గా పేరు తెచ్చుకున్న యశస్వి జైస్వాల్ కూడా తన వన్డే అరంగేట్రం చేసి, ఈ టోర్నీలో పాల్గొనవచ్చు.
చాంపియన్స్ ట్రోఫీకి 30 రోజులు
ఈ మెగా టోర్నీ ఫిబ్రవరి 19, 2025న పాకిస్తాన్ వేదికగా ప్రారంభమవుతుంది. ఫిబ్రవరి 20న భారత్ తమ తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో తలపడనుంది. ఫిబ్రవరి 23న పాకిస్తాన్‌తో హోరాహోరీ పోరుకు సిద్ధమవుతోంది. భారత్ మ్యాచ్‌లన్నీ దుబాయ్‌లో జరగనుండగా, స్పిన్ అనుకూల పిచ్‌లకు తగిన విధంగా జట్టును సిద్ధం చేశారు.
రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ ఓపెనింగ్ జోడీగా బరిలోకి దిగే అవకాశం ఉంది. గిల్ ఫామ్ సమస్యల కారణంగా, లెఫ్ట్-రైట్ కాంబినేషన్ కోసం యశస్వి జైస్వాల్‌ను ఓపెనర్‌గా ఆడించవచ్చు. విరాట్ కోహ్లీ మూడో స్థానంలో ఆడతారని, పరిస్థితుల ఆధారంగా శ్రేయస్ అయ్యర్ లేదా శుభ్‌మన్ గిల్ స్థానాలు మారవచ్చు. వికెట్ కీపింగ్ బాధ్యతలను కేఎల్ రాహుల్ చూసే అవకాశం ఎక్కువగా ఉన్నప్పటికీ, రిషబ్ పంత్ ప్రత్యామ్నాయంగా నిలుస్తాడు.
స్పిన్ విభాగంలో రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్ కీలక పాత్ర పోషించనున్నారు. పేస్ బౌలింగ్ విభాగంలో జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమీ ప్రధానంగా ఉంటారు. ఫిట్‌నెస్ సమస్యల ఉంటే అర్ష్‌దీప్ సింగ్ జట్టులోకి వస్తాడు.
భారత తుది జట్టు (అంచనా):
రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమీ.