చిన్న పిల్లలకు నేటి నుంచే ఆధార్ కార్డులు జారీ..

Aadhaar Cards To Be Issued To Minors From Today

ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. చిన్న పిల్లలకు కూడా ఆధార్ కార్డులు జారీ చేయాలని నిర్ణయించింది. భారతదేశంలో పౌరసత్వం గుర్తింపునకు ఆధార్ కార్డే కీలకం. భారత దేశ పౌరుడిగా గుర్తింపు పొందాలంటే ఆధార్ వివరాల నమోదు తప్పనిసరి. అందుకే పిల్లలకు కూడా బ్లూ కలర్ ఆధార్ కార్డు జారీ చేస్తుంటారు. దీనినే బాలల ఆధార్ అని‌ పిలుస్తుంటారు. దీనికి పిల్లల బయోమెట్రిక్‌తో పని లేదు. పిల్లల పేరు, ఫోటో, తల్లిదండ్రుల వివరాలు వంటి ప్రాథమిక సమాచారంతోనే ఈ కార్డును తయారుచేస్తారు.
ఆ తర్వాత ఐదేళ్లకు పిల్లల బయోమెట్రిక్ వివరాలు సమర్పించి ఆధార్ అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే చాలా రోజులుగా పిల్లల ఆధార్ కార్డుల జారీ ప్రక్రియ సరిగ్గా జరగడం లేదు. దీంతో ఏపీ ప్రభుత్వం ఈరోజు నుంచి ఆధార్ కార్డుల జారీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పటివరకు ఏపీలో 11.65 లక్షల మంది పిల్లలకు ఆధార్ కార్డులు లేనట్లు అధికారులు గుర్తించారు. వారందరికీ ఈరోజు నుంచి బ్లూ ఆధార్ కార్డులు మంజూరు చేయడానికి నిర్ణయించింది. దీనిపై ప్రత్యేక ఉత్తర్వులు జారీచేసి.. ఆధార్ కార్డు కేంద్రాలకు నిర్దిష్టమైన మార్గదర్శకాలు కూడా వెల్లడించింది.

దీనికోసం..పిల్లల తల్లిదండ్రుల ఆధార్ కార్డులు, పిల్లల డేట్ అఫ్ బర్త్ సర్టిఫికెట్లు, పాస్ పోర్టు సైజ్ ఫోటోలు అవసరం ఉంటుంది. అలాగే ఆధార్ రిజిస్ట్రేషన్ ఫారం నింపాల్సి ఉంటుంది. అందులో ఆ పిల్లల తల్లిదండ్రుల ఆధార్ నెంబర్లు తప్పనిసరిగా నమోదు చేయాలి. అయితే ఈ ఫారాన్ని యుఐడిఏఐ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుందని అధికారులు చెప్పారు.

తల్లిదండ్రుల ఫోన్ నెంబర్లను పిల్లల బ్లూ ఆధార్ కార్డు నెంబర్‌కు అనుసంధానిస్తారు. అందుకే కచ్చితమైన ఫోన్ నెంబర్ను ఇవ్వాల్సి ఉంటుంది.ఆధార్ కార్డు కోసం సమర్పించిన ధ్రువపత్రాలను పరిశీలించి ఒక ఐడీ ఇస్తారు. 60 రోజుల్లోనే పిల్లల ఆధార్ కార్డు జారీ అవుతుంది. ఈ బ్లూ ఆధార్ కార్డు పూర్తిగా ఉచితంగా అందిస్తారు.