ఉత్తర ప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో మహా కుంభమేళా చాలా ఘనంగా జరుగుతుంది. ఈ కుంభమేళాకు దేశం, ప్రపంచం నలుమూలల నుంచి ప్రజలు హాజరవుతున్నారు. పన్నెండేళ్లకు ఒకసారి జరిగే కుంభమేళా నాలుగు పవిత్ర పుణ్యక్షేత్రాలైన ప్రయాగ్ రాజ్, హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్ లలో మాత్రమే జరుగుతూ ఉంటుంది.
ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాకు వచ్చే నెలలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా హాజరవుతారని తెలుస్తోంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధంఖర్, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు మరికొంతమంది ప్రముఖులు వివిధ తేదీలలో ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లనున్నట్లు యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ చెప్పారు.
ఫిబ్రవరి 5న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మహాకుంభమేళాని సందర్శించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా..జనవరి 27న జరిగే మహా కుంభమేళాలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరుకాబోతుండగా.. ఫిబ్రవరి 10న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రయాగ్‌రాజ్‌ని సందర్శిస్తారు. ఇలా ప్రముఖ నేతలంతా ప్రయాగ్ రాజ్‌లో పర్యటించి మహాకుంభమేళాలో నిర్వహించే పలు ప్రధాన కార్యక్రమాలకు హాజరు కానున్నట్టు సమాచారం.
ఫిబ్రవరి 1న జరిగే కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి జగదీప్ ధంఖర్ కూడా పాల్గొంటారని వార్తలు వినిపిస్తున్నాయి. జనవరి 27న హోంమంత్రి అమిత్ షా తన షెడ్యూల్ ప్రకారం మహాకుంభ్‌లో పాల్గొంటారు. అమిత్ షా ముందుగా సంగమంలో పవిత్ర స్నానం చేసి గంగపూజ నిర్వహించి అధికారులతో సమావేశం కానున్నారని తెలుస్తోంది. కాగా ప్రముఖుల పర్యటన నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లును కట్టుదిట్టం చేయడానికి అధికారులు రెడీ అయ్యారు.
మరోవైపు జనవరి 26 గణతంత్ర దినోత్సవం, మౌని అమావాస్య, వసంత పంచమి సందర్భంగా.. మహాకుంభమేళాకు భక్తులు మరింతగా పెరిగే అవకాశం ఉంది. దీంతో ప్రయాగ్ రాజ్ ప్రాంతంలో జనసమూహ నిర్వహణ, కమ్యూనికేషన్ వ్యవస్థను మరింత మెరుగుపరచడంపై సీఎం అధికారులకు మార్గనిర్దేశం చేశారు. ఈ సమయంలో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లను చేయాలని సూచిస్తూ అధికారులకు మార్గదర్శకాలు జారీ చేశారు.