ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారుల ఎంపిక ఆలస్యం

Selection Of Indiramma House Beneficiaries Delayed

తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని అధికారులు చెబుతున్నారు. తెలంగాణ వ్యాప్తంగా నిర్వహిస్తున్న లబ్దిదారుల ఎంపికలో ..ప్రజల ఆందోళనలు, అభ్యంతరాలు పెరుగుతుండటంతో.. లబ్దిదారుల ఎంపికకు మరింత సమయం పట్టే అవకాశం ఉందని అంటున్నారు. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం అయితే.. నియోజక వర్గానికి 3,500 మంది చొప్పున తెలంగాణ వ్యాప్తంగా నాలుగున్నర లక్షల మంది అర్హులను గుర్తించి జనవరి 26 వ తేదీన ప్రకటించాల్సి ఉంది. కానీ ఇప్పుడున్న పరిస్థితి చూస్తుంటే.. ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారుల ఎంపికకు మరింత సమయం పట్టేలా కనిపిస్తుందని అధికారులు చెబుతున్నారు.

ప్రస్తుతం జరుగుతున్న గ్రామసభల్లో అధికారులు అర్హుల జాబితాను మాత్రమే ప్రకటిస్తు న్నారు. లబ్దిదారుల జాబితాను ప్రకటించడం లేదు. అయితే అర్హుల జాబితాలో తమ పేర్లు లేవంటూ ప్రజల నుంచి పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. దీంతో ఈ నెల 26న ప్రభుత్వం ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించి..ఆ తర్వాత పూర్తి స్థాయి కసరత్తు చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం తెలంగాణలో నిర్వహిస్తున్న గ్రామసభల్లో ఇందిరమ్మ ఇళ్ల కోసం అధికారులకు పెద్దఎత్తున దరఖాస్తులు అందుతున్నాయి. సుమారు 8 లక్షలకు పైగానే దరఖాస్తులు రావడంతో.. వీటిని సమగ్రంగా పరిశీలించాకే పూర్తిస్థాయి జాబితాపై దృష్టి సారించాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చాక గతేడాది ‘ప్రజాపాలన’ కార్యక్రమాన్ని నిర్వహించింది.

తెలంగాణ వ్యాప్తంగా నాటి ప్రజాపాలనలో భాగంగా ఇందిరమ్మ ఇళ్ల కోసం పెద్ద సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. దీంతో పాటు లబ్ధిదారుల ఎంపిక కోసం గ్రేటర్ హైదరాబాద్ తప్ప మిగిలిన అన్ని జిల్లాల్లో కూడా 100 శాతం యాప్ సర్వే నిర్వహించారు.అయితే ఇళ్ల కోసం తాము దరఖాస్తు చేసినా కూడా.. స్థల పరిశీలన కోసం సర్వేయర్లు ఎవరూ కూడా రాలేదని ప్రజల నుంచి ఫిర్యాదులు ఎక్కువయ్యాయి. దీంతో ఇప్పుడు గ్రామసభల్లో మళ్లీ ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. గతంలో దరఖాస్తు చేసిన వారు కూడా మరోసారి దరఖాస్తు చేసుకునే అవకాశం ఇచ్చారు.

ఈ ఏడాది నాలుగున్నర లక్షల మందికి ఇళ్లను నిర్మించాలని తెలంగాణ ప్రబుత్వం భావిస్తోంది. మొదటి విడతలో సొంత ఇంటి స్థలం ఉన్న వారికి ఇళ్లను మంజూరు చేస్తామని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. తెలంగాణలో సొంతింటి కోసం స్థలం ఉన్న వారు మొత్తం 13 లక్షల మంది ఉన్నట్లు యాప్ సర్వేలో గుర్తించారు. దీంతో నియోజకవర్గాల్లో గ్రామాల వారీగా లబ్దిదారుల ఎంపికకు కసరత్తు కొనసాగుతుండగా..మరోవైపు గ్రామ సభలు రసాభాసగా మారుతున్నాయి.