పాపం, ఆమె మానసిక రుగ్మతలతో బాధపడేది. ఆరోగ్యం క్షీణించి ఎప్పుడు ఏం చేస్తుందో అర్థం కాని పరిస్థితిలో కుటుంబసభ్యులు ఆమెకు నిరంతరం సహాయం అందిస్తూ ఆసుపత్రిలో చికిత్స అందించారు. అయితే ఈ క్రమంలో అనుకోని సంఘటన చోటుచేసుకుంది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె సెల్‌ఫోన్‌ను మింగేయడంతో ప్రాణాలు కోల్పోయింది.
రాజమహేంద్రవరం రూరల్ మండలం బొమ్మూరుకు చెందిన పెనుమళ్ల రమ్య స్మృతి (35) గత 15 ఏళ్లుగా మానసిక రుగ్మతలతో బాధపడుతోంది. ఆమె ఆరోగ్యం మరింత క్షీణించడంతో శనివారం కుటుంబ సభ్యులు ఆమెను రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతుండగా, స్మృతి అనుకోకుండా కీప్యాడ్ మొబైల్‌ను మింగేసింది.
సెల్‌ఫోన్ కనిపించకపోవడంతో బంధువులు ఆందోళన చెందారు. తర్వాత స్మృతిని ప్రశ్నించగా, ఆమె మొబైల్ మింగినట్లు చెప్పింది. వెంటనే డాక్టర్లకు సమాచారం అందించగా, వైద్యులు పరీక్షించి సర్జరీ ద్వారా మొబైల్‌ను తొలగించారు. సర్జరీ అనంతరం వైద్యులు స్మృతి ఈసోపేగస్ (అన్నవాహిక) పూర్తిగా దెబ్బతిందని పేర్కొన్నారు. పరిస్థితి విషమించడంతో కుటుంబసభ్యులు ఆమెను కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ స్మృతి ఆదివారం మృతి చెందింది.
రాజమహేంద్రవరం వైద్యుల నిర్లక్ష్యం కారణంగా తమ కుమార్తె ప్రాణాలు కోల్పోయిందని మృతురాలి తండ్రి ఆరోపించారు. 2010 నుంచి ఆమెకు మానసిక సమస్యలతో చికిత్స అందిస్తున్నామని తెలిపారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఈ ఘటన మానసిక ఆరోగ్య సమస్యలపై అవగాహనను పెంచాల్సిన అవసరాన్ని మరింత స్పష్టంగా చూపిస్తోంది.