రాజకీయాలకు గుడ్‌బై చెప్పి విజయసాయిరెడ్డి ఏం చేస్తున్నారో తెలుసా..? మీరే చూడండి..

Vijayasai Reddy Bids Farewell To Politics Embraces Farming

వైసీపీ కీలక నేత, రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి రాజకీయాలకు గుడ్‌బై చెప్పారు. శాశ్వతంగా రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు ఆయన ప్రకటించారు. తన రాజ్యసభ పదవికి రాజీనామా చేసిన విజయసాయిరెడ్డి, ఇది పూర్తిగా వ్యక్తిగత నిర్ణయమని, ఎలాంటి ఒత్తిళ్లు లేవని స్పష్టం చేశారు.

వైసీపీ తరఫున రాజ్యసభకు ఎన్నికైన ఆయన, ఇంకా మూడున్నరేళ్లు పదవీ కాలం ఉన్నప్పటికీ అనూహ్యంగా రాజీనామా చేయడం పట్ల పార్టీ శ్రేణులు ఆశ్చర్యం వ్యక్తం చేశాయి. జగన్ లండన్ పర్యటనలో ఉన్న సమయంలో రాజీనామా చేయడం, ఇది తక్షణమే ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ ఆమోదించడం చకచక జరిగిపోయాయి.

రాజీనామా అనంతరం, రాజకీయాలకు దూరంగా ఉండి తన జీవితాన్ని వ్యవసాయం వైపు మలుపు తిప్పుతున్నట్లు విజయసాయిరెడ్డి వెల్లడించారు. ఈ మేరకు తన ఉద్యానపంటల కార్యాచరణను ప్రారంభించినట్టు ప్రకటించి, జీప్‌లో సింపుల్ డ్రెస్‌లో ఉండి బొటనవేలిని పైకెత్తి చిరునవ్వుతో ఉన్న ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. “నా ఉద్యాన పంటల కార్యకలాపాలను ప్రారంభించానని చెప్పడానికి సంతోషిస్తున్నాను” అంటూ ఆయన ట్వీట్ చేశారు.

అలాగే, గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ శకటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందని కొనియాడారు. ఏటికొప్పాక బొమ్మల శకటం పురాతన కళల నైపుణ్యాన్ని ప్రతిబింబించిందని అభినందనలు తెలిపారు.

అయితే, విజయసాయిరెడ్డి రాజీనామా వెనుక అసలు కారణం ఏమిటి అనే చర్చ కొనసాగుతూనే ఉంది. ఇటీవలే ఉత్తరాంధ్ర బాధ్యతలు స్వీకరించిన సమయంలో ఇలా రాజీనామా చేయడం పట్ల వైసీపీ శ్రేణులు ప్రశ్నలతో నిలిచాయి.

ఇక విజయసాయిరెడ్డి చెప్పినట్టుగానే, రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకుని వ్యవసాయం చేసే జీవనానికి నడుం బిగించారు. ప్రస్తుతం ఆయన తీసుకున్న ఈ కొత్త మార్గం హాట్ టాపిక్‌గా మారింది.