మహా కుంభమేళాలో తొక్కిసలాట.. ఆరా తీసిన ప్రధాని.. కీలక నిర్ణయం తీసుకున్న యూపీ ప్రభుత్వం..

Stampede At Maha Kumbh Mela 17 Dead Over 40 Injured In Prayagraj

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో అంగరంగ వైభవంగా కొనసాగుతున్న మహా కుంభమేళా 2025లో దురదృష్టకర ఘటన చోటు చేసుకుంది. మౌని అమావాస్య సందర్భంగా త్రివేణి సంగమం వద్ద జరిగిన తొక్కిసలాటలో 17 మంది భక్తులు మృతి చెందగా, 40 మందికి పైగా గాయపడ్డారు. గాయపడిన భక్తులను సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఈ ఘటనకు భక్తుల అధిక సంఖ్యలో తరలి రావడమే కారణమని తెలుస్తోంది. గంగా-యమున- సరస్వతి నదుల సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు లక్షలాది మంది భక్తులు హాజరయ్యారు. భారీ భక్తజన సందోహానికి బారికేడ్లు విరిగి పడిపోవడంతో తొక్కిసలాట చోటు చేసుకుంది.

పోలీసు విభాగం, విపత్తు నిర్వహణ సిబ్బంది వెంటనే స్పందించి సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను మోతీలాల్ నెహ్రూ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు. కేంద్రం నుంచి పూర్తి సహాయ సహకారాలను అందిస్తామని హామీ ఇచ్చారు.

అఖండ పరిషత్ కమిటీ ఈ ఘటన దృష్ట్యా కీలక నిర్ణయం తీసుకుంది. మౌని అమావాస్య సందర్భంగా అమృత స్నానాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. అమృత స్నానాల కోసం కోటి మందికి పైగా భక్తులు వచ్చే అవకాశం ఉండటంతో ముందస్తు జాగ్రత్త చర్యగా ఈ నిర్ణయం తీసుకుంది.

ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళా జనవరి 13న ప్రారంభమైంది. ఇప్పటివరకు 15 కోట్ల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించినట్లు అధికారులు వెల్లడించారు. మంగళవారం ఒక్కరోజే 4.5 కోట్ల మంది భక్తులు సంగమం వద్ద పవిత్ర స్నానం చేశారు. భక్తుల అధిక సంఖ్యలో చేరిక వల్ల తొక్కిసలాట జరిగిందని తెలుస్తోంది. అధికార యంత్రాంగం మరిన్ని జాగ్రత్త చర్యలు తీసుకుంటోంది.