కాఫీ స్ట్రెస్ పోగొట్టుకోవడానికి, రిలాక్స్ అవడానికే కాదు.. దానితో అందానికి మెరుగులు కూడా దిద్దుకోవచ్చంటున్నారు స్కిన్ కేర్ ఎక్స్ పర్ట్స్. ఇప్పటికే చాలామంది హెన్నా పొడిలో కాఫీపొడి కలిపి.. హెయిర్ గ్రోత్ తో పాటు.. వైట్ హెయిర్ సమస్య నుంచి బయటపడుతున్నారు. ఇప్పుడు కాఫీ పొడితో సింపుల్ గా, తక్కువ ఖర్చుతో అందాన్ని సొంతం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
కాఫీని ఉపయోగించడం వల్ల డార్క్ సర్కిల్స్ పూర్తిగా తగ్గిపోతాయి. దీని కోసం మీరు కొద్దిగా కాఫీ గింజలు తీసుకొని మెత్తగా పౌడర్ చేసుకోవాలి. లేదా మార్కెట్లో కాఫీ పొడిని వాడొచ్చు. దానిలో కాస్త కలబంద గుజ్జు వేసి ఈ మిశ్రమాన్ని డార్క్ సర్కిల్స్ ఉండే ప్రాంతంలో అయినా.. లేదా ఫేస్ అంతా అయినా అప్లై చేయాలి. ఆ మిశ్రమాన్ని కాసేపు అలా వదిలేసి తర్వాత ముఖాన్ని చల్లటినీటితో కడిగేసుకోవాలి. దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఏజింగ్ గుణాలు డార్క్ సర్కిల్స్ ని పూర్తిగా తొలగించి చర్మానికి ఎంతో మేలు చేస్తాయి.
కాఫీతో ఫేస్ స్క్రబ్ వేసుకోవడం వల్ల దుమ్ము, ధూళి, కాలుష్యం వలన కలిగే ఇబ్బందులు అన్నీ పోతాయి. ముఖాన్ని ఎంతో క్లియర్ గా ఉంచుతుంది. అదే విధంగా గ్లో ని కూడా పెంచుతుంది. ఈ ఫేస్ స్క్రబ్ కోసం పెద్దగా కష్టపడక్కర్లేదు కూడా. కొద్దిగా కాఫీ పొడి లేదా కాఫీ గింజలలో పంచదార వేసి మిక్సీలో మెత్తగా పొడి చేయాలి. దానిలో ఆలివ్ ఆయిల్ కలుపుకుని స్క్రబ్ కింద వాడుకోవాలి. చేతులు , మెడ ప్రాంతాల్లో కూడా దీనిని స్క్రబ్ గా వాడొచ్చు. బిఫోర్, ఆఫ్టర్ తేడాలు గమనిస్తే మీరే ఆశ్చర్యపోతారు.
కాఫీ వల్ల పెదవులు కూడా మృదువుగా మారతాయి. గులాబీరంగులో, స్మూత్ గా మారిపోతాయి. కొద్దిగా కాఫీ గింజలు కానీ, కాఫీ పొడిలో తేనె కలుపుకుని దానిని పెదాలపై అప్లై చేస్తే సరిపోతుంది. పెదవులు పొడిబారిపోయినా, పగిలిపోయినా దీనిని రాస్తే వెంటనే ఫలితం ఉంటుంది. కొందరికి పెదవులు నల్లగా ఉంటాయి. అలాంటి వారికి కూడా ఇది అప్లై చేస్తే మంచి రిజల్ట్ కనిపిస్తుంది.