బీఆర్ఎస్.. తెలంగాణలో పదేళ్లు అధికారంలో ఉన్న పార్టీ. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఆ పార్టీని ప్రతిపక్షానికి పరిమితం చేశారు. అధికారం అనుభవించినంతకాలం కలిసి ఉన్న నేతలు ఇప్పుడు ఎవరికి వారు అన్నట్లు వ్యవహరిస్తున్నారు. కేసీఆర్ ఫామ్‌హౌస్‌కే పరిమితమయ్యారు. బావా, బావ మరుదులు అయిన హరీశ్‌రావు, కేటీఆర్ మధ్య కోల్డ్ వార్ జరుగుతోంది. కవిత తనదారి తాను చూసుకుంటోంది.
తెలంగాణ ఉద్యమ పార్టీగా బీఆర్‌ఎస్‌కు ఉన్న ముద్ర ఎప్పటికీ చెరిగిపోదు. అందుకే బీఆర్ఎస్ పార్టీ కూడా ఆ సెంటిమెంటునే అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నాయి. అయితే ఎంత సెంటుమెంటు ప్రజల్లోకి తీసుకువెళ్లినా.. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీకి పరాభవం తప్పలేదు. అధికారంలో ఉన్నన్ని రోజులు అందరూ కేసీఆర్ చెప్పిందే వేదం ..చేసిందే శాసనం అన్నట్లుగా ఉండేది. అధికారం పోగానే ఎవరి దారి వారిదే అన్నట్లుగా సాగుతున్నాయన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.
ముఖ్యంగా పార్టీలో కీలక స్థానాల్లో ఉన్న బావాబావమరుదులు అయిన కేటీఆర్, హరీశ్‌రావు మధ్య కొంచెం కూడా పొసగడం లేదని తెలుస్తోంది. ఓటమి తర్వాత కేసీఆర్ పూర్తిగా ఫామ్‌హౌస్‌కే పరిమితమయ్యారు. కవిత తన సొంత జిల్లా అయిన నిజామాబాద్ రాజకీయాలపైనే ఎక్కువ దృష్టి పెడుతున్నారు. ఈ సమయంలో కేటీఆర్, హరీశ్‌రావు ఎవరికి వారు అన్నట్లుగా కార్యక్రమాలు నిర్వహించడంతో పార్టీ కేడర్ కూడా అయోమయానికి గురవుతుందన్న వార్తలు వినిపిస్తున్నాయి.
అధికారం కోల్పోయాక డీలా పడిన బీఆర్ఎస్ పార్టీని ఒక తాటిన ఉండేలా చేయాల్సిన గులాబీబాస్ కేసీఆర్..పూర్తిగా ఫామ్ హౌస్‌కు పరిమితం అవడంతో ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా పార్టీ మారిపోయింది. ప్రతిపక్ష నేతగా ప్రజా సమస్యలపై పోరాడాల్సిన కేసీఆర్.. తనకేం పట్టనట్లు దూరంగా ఉంటున్నారు. అడపా దడపా ఫాంహౌస్‌కు వెళ్లి కలిసినవారి మాత్రమే మీటింగ్‌లు పెడుతూ వ్యవసాయంతోనే ఎక్కువ సమయం గడుపుతున్నారు. ప్రారంభంలో.. పార్టీ బరువు, బాధ్యతలు మోస్తూ వచ్చిన కేటీఆర్, హరీశ్‌రావు.. ఇప్పుడు పోటా పోటీగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పార్టీ క్యాడర్‌ను తమవైపు తిప్పుకోవడానికి పోటీ పడుతుండటంతో.. ఎటు వెళ్లాలో తెలియక కార్యకర్తలు సతమతమవుతున్నారు.
ఇటీవల పదవీకాలం ముగిసిన మున్సిపల్ చైర్మన్లను, వైస్ చైర్మన్లను గులాబీ నేతలు సత్కరించిన కార్యక్రమానికి కేటీఆర్, హరీశ్‌రావు ఇద్దరూ హాజరవుతారని అంతా అనుకున్నా..కేటీఆర్ ఒక్కరే వెళ్లడం చర్చనీయాంశం అయింది. తాజాగా అంబేద్కర్ విగ్రహాలను కూడా వీరిద్దరూ ఒకేరోజు వేర్వేరుగా ఆవిష్కరించడం హాట్ టాపిక్ అయింది. దీంతో పైకి ఐక్యతా రాగాలు వినిపిస్తున్న కేటీఆర్, హరీశ్‌రావు మధ్య ఎప్పటి నుంచో కోల్డ్‌వార్ జరుగుతోందన్న వార్త జోరుగా వినిపిస్తుంది. ఇద్దరి నేతల తీరుతో కేడర్‌లో అయోమయం నెలకొంది.