ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమై సాయంత్రం 6 గంటల వరకూ కొనసాగనుంది. ఓటర్లు పోలింగ్ కేంద్రాల దగ్గర సామాన్యల నుంచి ప్రముఖుల వరకు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఈ ఎన్నికల్లో 699 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. మొత్తం 70 స్థానాలలో జరుగుతున్న పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించడం కోసం ఎన్నికల సంఘం భారీ ఏర్పాట్లు చేసింది. ఇవాళ సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ వెలువడనుండగా.. ఫిబ్రవరి 8న ఓట్ల లెక్కింపు ఉంటుంది.
ఢిల్లీలో మొత్తం 1.56కోట్ల మంది ఓటర్లు ఉండగా.. 13,766 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. వీటిలో దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా 733 కేంద్రాలు కేటాయించారు.. వృద్ధులు, వికలాంగుల కోసం ముందస్తు పోలింగ్‌కు అవకాశం ఇవ్వడంతో.. 7,980 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 3వేల పోలింగ్ బూత్‌లను సున్నితమైనవిగా ఎన్నికల సంఘం అధికారులు గుర్తించి..ఆ ప్రాంతాల్లో డ్రోన్లతో పర్యవేక్షిస్తున్నారు. పోలింగ్ భద్రత కోసం భారీగా కేంద్ర బలగాలు మోహరించాయి. 200 కంపెనీలకుపైగా సాయుధ బలగాలు, 35వేల మంది వరకూ ఢిల్లీ పోలీసులు, 15వేల మంది హోంగార్డులు ఈ ఎన్నికల విధుల్లో ఉన్నారు.
ఇక ఇటు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ గెలిచి మరోసారి తమ అధికారాన్ని నిలబెట్టుకుంటామని ఆప్ ధీమా వ్యక్తం చేస్తుండగా.. ఈసారి ఢిల్లీలో కాషాయ జెండా ఎగరడం ఖాయమని బీజేపీ నేతలు గట్టిగా చెబుతున్నారు. ఈ రెండు పార్టీలు కాదు ఢిల్లీలో తామే సత్తా చాటుతామని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. న్యూ ఢిల్లీ నియోజకవర్గం నుంచి మాజీ సీఎం కేజ్రీవాల్ పోటీలో నిలబడగా..బీజేపీ నుంచి పర్వేశ్ వర్మ, కాంగ్రెస్ నుంచి ఢిల్లీ మాజీ సీఎం షీలా దీక్షిత్ కుమారుడు అయిన సందీప్ దీక్షిత్ పోటీలో ఉన్నారు. కల్కాజీ అసెంబ్లీ స్థానం నుంచి ఢిల్లీ ముఖ్యమంత్రి ఆతిశీ కూడా బరిలో ఉన్నారు. జంగ్‌పురా నుంచి మనీష్ సిసోడియా, బీజేపీ నుంచి సర్దార్ తర్వీందర్ సింగ్, కాంగ్రెస్ పార్టీ నుంచి ఫర్హాద్ సురీలు పోటీలో నిలబడ్డారు.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో.. ప్రత్యేకంగా పింక్ కలర్ రంగుల్లో బూత్‌లను ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. ఆయా పోలింగ్ కేంద్రాల్లో బెలూన్ల తోరణాలతో ఆకర్షణీయంగా సిద్ధం చేశారు. పింక్ బూత్‌లు ‘మహిళలను నడిపించడం, దేశాన్ని నడిపించడం’ అనే స్పెషల్ థీమ్‌తో తీసుకొచ్చారు. మరోవైపు దేశంలోనే తొలిసారిగా.. ఢిల్లీలో పోలింగ్ సెంటర్ల దగ్గర రద్దీని తెలుసుకోవడానికి వీలుగా క్యూ మేనేజిమెంట్ సిస్టమ్ అప్లికేషన్‌ను ప్రవేశపెట్టారు.