ఓటీటీలో పుష్పగాడి రూల్.. నిజంగానే ఇంటర్నేషనల్ లెవల్.. రికార్డులు విషయంలో అస్సలు తగ్గడం లేదుగా..!

Pushpa 2 Allu Arjun Netflix Trending Box Office Records Action Sequences

అల్లు అర్జున్ హీరోగా, సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘పుష్ప 2: ది రూల్’ సినిమా థియేటర్లలో విజృంభించిన తరువాత ఇప్పుడు ఓటీటీలోనూ తుఫాను సృష్టిస్తోంది. గతేడాది డిసెంబర్ 5న గ్రాండ్‌గా విడుదలైన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.1896 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. థియేటర్లలో రికార్డుల మోత మోగించిన ఈ సినిమా ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లోనూ ట్రెండ్ అవుతోంది.

నెట్‌ఫ్లిక్స్‌ ఈ సినిమా డిజిటల్ హక్కులను కొనుగోలు చేసి, జనవరి 30 నుంచి స్ట్రీమింగ్‌కు తెచ్చింది. అలా వచ్చి రాగానే ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ను ఓవర్టేక్ చేస్తూ, పుష్ప రాజ్‌ మరోసారి తన హవా చూపిస్తున్నాడు. నాన్‌-ఇంగ్లీష్‌ సినిమాల విభాగంలో ‘పుష్ప 2’ గ్లోబల్‌గా 5.8 మిలియన్ల వ్యూస్‌ సాధించి, నెట్‌ఫ్లిక్స్‌లో రెండో స్థానాన్ని దక్కించుకుంది. అంతేకాదు, ఏడు దేశాల్లో నంబర్ 1 స్థానాన్ని కూడా దక్కించుకోవడం గమనార్హం.

ఈ సినిమా ప్రత్యేకత ఏమిటంటే, ఓటీటీలో ‘పుష్ప 2’ రీలోడెడ్ వెర్షన్ అందుబాటులోకి వచ్చింది. థియేటర్లలో 3 గంటల 20 నిమిషాల నిడివితో వచ్చిన ఈ సినిమాను ఓటీటీలో మరో 20 నిమిషాలు పొడిగించి విడుదల చేశారు. ప్రేక్షకులు ముందుగా చూడని కొన్ని అదనపు సన్నివేశాలతో ఈ వెర్షన్‌ను మరింత ఆసక్తికరంగా మార్చారు. ముఖ్యంగా క్లైమాక్స్ ఫైట్ సీక్వెన్స్ ప్రేక్షకులకు గూస్‌బంప్స్ తెప్పించడంతో, నెటిజన్లు ఆ సీన్స్‌ను సోషల్ మీడియా వేదికగా విపరీతంగా షేర్ చేస్తున్నారు.

ఇంటర్నేషనల్‌ ఆడియన్స్ కూడా ఈ సినిమాపై సూపర్ రెస్పాన్స్ ఇస్తున్నారు. ‘పుష్ప 2’ యాక్షన్ సీన్స్ హాలీవుడ్ సినిమాలను తలదన్నేలా ఉన్నాయని, మార్వెల్ స్థాయిలో క్రియేటివిటీ ఉందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఓటీటీ స్ట్రీమింగ్‌ ప్రారంభమైనప్పటి నుంచే ఈ సినిమా ఇండియాతో పాటు విదేశాల్లోనూ టాప్ ట్రెండింగ్‌లో నిలిచింది.

మొత్తంగా, థియేటర్లలో సక్సెస్‌ను ఎంజాయ్ చేసిన ‘పుష్ప 2’ ఇప్పుడు ఓటీటీలోనూ అల్లు అర్జున్ బ్రాండ్‌ను మరో లెవెల్‌కు తీసుకెళ్తోంది. ‘పుష్ప రాజ్ అంటే నేషనల్ అనుకుంటివా? ఇంటర్నేషనల్’ అనే డైలాగ్ నిజమవుతున్నట్లుగా ఉంది. మరి ఈ సినిమా ఇంకెన్ని రికార్డులు బ్రేక్ చేస్తుందో చూడాలి!