తెలంగాణలో త్వరలో నిర్వహించనున్న టెన్త్ పబ్లిక్ పరీక్షలకు విద్యాశాఖ పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నారు. మార్చి 21 నుంచి జరగబోతున్న పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో పేపర్ లీకేజీలకు తావులేకుండా వీటిని అరికట్టడానికి తొలిసారిగా సరికొత్త విధానాన్ని ప్రవేశ పెట్టబోతోంది. అయితే పబ్లిక్ పరీక్షల సమయంలో ప్రతీ ఏటా పేపర్ లీకేజీలు అధికారులకు తలనొప్పిగా మారుతుండటంతో.. వీటి నుంచి బయటపడటానికి పలు చర్యలకు ఉపక్రమించింది.అలాగే పేపర్ లీకేజీలకు పాల్పడిన వారిపై విద్యాశాఖ కఠిన చర్యలు తీసుకోనుంది.
తెలంగాణలో 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి పదో తరగతి పబ్లిక్ పరీక్షలు సమీపిస్తుండటంతో.. నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రీ ఫైనల్ పరీక్షలు జరుగుతున్నాయి. అయితే పబ్లిక్ పరీక్షల సమయంలో ప్రతీ ఏడాది పేపర్ లీకేజీలు అధికారులకు తలనొప్పిగా మారడంతో.. తొలిసారిగా టెన్త్ ప్రశ్నాపత్రాలపై సీక్రెట్ సెక్యూరిటీ కోడ్‌ను ముద్రించ బోతుంది.
వచ్చే నెలలో జరగబోయే పరీక్షల కోసం రూపొందించిన అన్ని ప్రశ్నాపత్రాల్లో కూడా ఈ సీక్రెట్ సెక్యూరిటీ కోడ్‌ను ముద్రించడానికి పాఠశాల విద్యాశాఖ చర్యలు చేపట్టబోతోంది. ఈ కోడ్ ద్వారా ఎక్కడైనా ఎవరైనా సరే పేపర్‌ను లీక్ చేస్తే..లీక్ చేసిన గంటల వ్యవధిలోనే నిందితులను పట్టుకునే అవకాశం ఉంటుంది. ఇప్పటికే దీనికి సంబంధించి కార్యాచరణకు అధికారులు కసరత్తు పూర్తి చేస్తున్నారు.
గతంలో కొన్ని సార్లు కొంతమంది ఇన్విజిలేటర్లే పదో తరగతి పేపర్లను లీక్ చేయడం, మరికొన్ని సార్లు వాట్సాప్‌లో కూడా ఎవరో ఒకరు పేపర్లు షేర్ చేయడం వంటివి చోటు చేసుకున్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకునే ఈసారి ఎవరైనా పేపర్ లీకేజీలకు పాల్పడితే.. వారిని కేవలం సస్పెన్షన్‌లతో సరిపెట్టకుండా.. ఉద్యోగాల నుంచి శాశ్వతంగా తొలగించనున్నట్లు విద్యాశాఖ హెచ్చరించింది.కాగా పదో తరగతి పరీక్షలు మార్చి 21వ తేదీ నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు జరుగుతున్నాయి. ఈసారి తెలంగాణ వ్యాప్తంగా దాదాపు 5.1 లక్షల మంది విద్యార్థులు పదో తగరతి పరీక్షలు రాయబోతున్నారు.