తిరుమల లడ్డూ వివాదానికి సంబంధించి సీబీఐ విచారణ కొనసాగుతున్న విషయం తెలిసిందే. సుప్రీంకోర్టు ఆదేశాలతో ప్రత్యేక దర్యాప్తు బృందం కూడా ఏర్పాటయి.. కొద్ది రోజులుగా విచారణ కొనసాగుతూ వస్తోంది. కాగా ఈ కేసులో.. నెయ్యి సరఫరా చేసిన నలుగురిని దర్యాప్తు బృందం అదుపులోకి తీసుకుంది. తమిళనాడుకు చెందిన ఏఆర్ డెయిరీ, ఉత్తరప్రదేశ్ కు చెందిన పరాగ్ డెయిరీ, ఆల్ఫా మిల్క్ ఫుడ్స్, ప్రీమియర్ అగ్రి ఫుడ్స్ సంస్థలకు సంబంధించిన కీలక వ్యక్తులను అదుపులోకి తీసుకుని మూడు రోజులుగా తిరుపతిలో విచారిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే వీరు విచారణకు సహకరించకపోవడంతో పాటు..తిరుమల శ్రీవారి ప్రసాదంలో కల్తీ నెయ్యి విషయంలో వారి ప్రమేయం ఉన్నట్లు ప్రాథమిక ఆధారాలు లభ్యమవడంతో.వీరందరినీ ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. లడ్డు వివాదంలో మున్ముందు మరిన్ని అరెస్టులు కూడా ఉంటాయని తెలుస్తోంది.
ప్రత్యేక దర్యాప్తు బృందం అదుపులో ఏఆర్ డెయిరీకి సంబంధించి విపిన్ గుప్తా, పోమిల్ జైన్, అపూర్వ చావడ, రాజశేఖర్ ఉన్నట్లు తెలుస్తోంది. కొద్దిరోజుల కిందట వెలుగు చూసిన లడ్డు వివాదం రెండు తెలుగు రాష్ట్రాలలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా ప్రకంపనలు రేపింది. లడ్డు తయారీలో జంతువుల కొవ్వు వాడారనేది ప్రధానంగా ఆరోపిస్తూ..ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సంచలన ఆరోపణలు చేశారు. అప్పుడున్నది వైసీపీ ప్రభుత్వం కావడంతో.. ఆ పార్టీకి చెందిన నేతలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి అధికారులను దీనిపై సంయుక్త విచారణ చేపట్టాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. ప్రస్తుతం ఓ అయిదుగురు అధికారుల నేతృత్వంలో ఈ ప్రత్యేక దర్యాప్తు కొనసాగుతోండగా..వీరి అరెస్టుతో ఈ విచారణ తుది దశకు వచ్చినట్లు తెలుస్తోంది.
తిరుమల వెంకన్న లడ్డు వివాదంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీసింది. దేశవ్యాప్తంగా హిందుత్వ వాదులు, హిందూ మత సంస్థలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టాయి. అప్పటి వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు ఎక్కువవడంతో.. చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే ఈ ఆరోపణలని ఆ పార్టీ నేతలు తప్పించుకునే ప్రయత్నం చేశారు. అంతేకాదు తమ పార్టీకి భారీ డ్యామేజ్ జరిగిందంటూ..సుప్రీంకోర్టును ఆశ్రయించి ప్రత్యేక పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం..ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించింది.
ఈ ప్రత్యేక దర్యాప్తు బృందం తిరుపతి కేంద్రంగా చేసుకొని కొద్ది రోజులుగా విచారణ చేపడుతోంది. అయితే లడ్డు వివాదానికి సంబంధించి ఏకంగా ఒకేసారి నలుగురిని అరెస్టు చేయడం సంచలనంగా మారింది. అంతేకాదు మున్ముందు మరిన్ని అరెస్టులు ఉంటాయని తెలియడంతో ఈ కేసుపై మరింత ఉత్కంఠ నెలకొంది. సీపీఐ హైదరాబాద్ డివిజన్ జాయింట్ డైరెక్టర్ వీరేశ్ ప్రభు, విశాఖ సీబీఐ ఎస్పీ మురళి రాంబ, విశాఖ డిఐజి గోపీనాథ్ జెట్టి, గుంటూరు ఐజీ సర్వ శ్రేష్టు త్రిపాఠి, ఎఫ్ఎస్ఎస్ఐ అధికారి సత్య కుమార్ పాండ్యా ఆధ్వర్యంలో ఈ విచారణ శరవేగంగా కొనసాగుతోంది. ఆరు నెలలపాటు ఈ విచారణ గడువు విధించడంతోనే తమ విచారణను స్పీడప్ చేసినట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగానే సమయం ఆసన్నం కావడంతో ఇప్పుడు అరెస్టుల పర్వం ప్రారంభమైనట్లు సమాచారం.