తమిళనాడులో ఎన్నికలకు మరో రెండేళ్లు ఉండగానే, రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారిపోతున్నాయి. పొత్తులపై ఇప్పటి నుంచే మంతనాలు ఊపందుకున్నాయి. ఈ క్రమంలో ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యం (ఎంఎన్ఎం) అధినేత కమలహాసన్‌ను అధికార డీఎంకే రాజ్యసభకు ఎంపిక చేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఫిబ్రవరి 12న బుధవారం నాడు దీనిపై చర్చించిన డీఎంకే, కమలహాసన్‌ను రాజ్యసభకు పంపాలని నిర్ణయించింది. తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
కమల్ హాసన్ 2018లో మక్కల్ నీది మయ్యం పేరుతో రాజకీయ పార్టీని ప్రారంభించి, 2021 తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో పోటీచేశారు. కోయంబత్తూరు సౌత్ స్థానం నుంచి బరిలోకి దిగినా, మూడో స్థానానికి పరిమితమయ్యారు. ఆయన పార్టీ ఒక్క సీటూ గెలుచుకోలేకపోయింది. అనంతరం కమల్ హాసన్ డీఎంకే పార్టీకి మద్దతు ఇస్తూ వస్తున్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లో డీఎంకే నేతృత్వంలోని ఇండియా కూటమికి మద్దతు ప్రకటించారు. ఈ నేపథ్యంలో, కమలహాసన్‌కు రిటర్న్ గిఫ్ట్‌గా రాజ్యసభ ఎంపీ పదవి దక్కినట్టైంది.
త్వరలో తమిళనాడు నుంచి ఆరు రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. సంఖ్యాబలం ప్రకారం నాలుగు సీట్లు అధికార డీఎంకే ఖాతాలోకి వెళ్తాయి. వీటిలో ఒక సీటును కమలహాసన్‌కు ఇవ్వాలని స్టాలిన్ నిర్ణయించారు. శాసనసభ ఎన్నికల్లో దారుణ పరాజయం తర్వాత కాంగ్రెస్ పార్టీ కూడా కమలహాసన్‌కు ఆఫర్ ఇచ్చింది. కానీ, ఆయన ఆ ఆఫర్‌ను తిరస్కరించి, పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయకుండా డీఎంకేకు మద్దతు ప్రకటించారు.
జూలైలో ఖాళీ కానున్న రాజ్యసభ స్థానం నుండి కమల్ హాసన్ డీఎంకే టికెట్‌పై పోటీ చేయనున్నారు. ఈ విషయంపై చర్చించేందుకు తమిళనాడు మంత్రి శేఖర్ బాబు కమల్ హాసన్‌ను కలిశారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో మక్కల్ నీతి మయ్యం అభ్యర్థిగా పోటీ చేయకుండా, డీఎంకే తరఫున ప్రచారం చేయడానికి కమల్ అంగీకరించారు. దీనిలో భాగంగా, కమల్ హాసన్‌కు డీఎంకే రాజ్యసభ సీటును ఆఫర్ చేసింది. ప్రస్తుతం అసెంబ్లీలో బలం ప్రకారం, డీఎంకే నలుగురిని రాజ్యసభకు పంపగలదు. మక్కల్ నీది మయ్యం నుంచి కమల్ హాసన్‌ను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటామని డీఎంకే స్పష్టం చేసింది.
ఇక కమల్ హాసన్‌తో పాటు మరో వ్యక్తికీ రాజ్యసభ స్థానం దక్కనున్నట్లు తెలుస్తోంది. 2024 పార్లమెంట్ ఎన్నికల సమయంలో, మక్కల్ నీది మయ్యం డీఎంకేతో పొత్తు పెట్టుకుంది. అప్పుడు కమల్ హాసన్‌ను రాజ్యసభకు పంపిస్తామని డీఎంకే అధినేత స్టాలిన్ హామీ ఇచ్చినట్లు సమాచారం. ఈ క్రమంలోనే కమల్ హాసన్‌ను రాజ్యసభకు పంపేందుకు డీఎంకే ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని డీఎంకే పార్టీకి చెందిన అధికార ప్రతినిధులు ధృవీకరించారు.