పెళ్లి అంటే నూరేళ్ల పంట అన్న మాట ఓపక్క ఉన్నా, కాలానికి తగ్గట్టు పెళ్లిపద్ధతులు మారిపోతున్నాయి. ఒకప్పుడు కుటుంబ నేపథ్యం, ఆస్తి, సంస్కారం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని సంబంధాలు కుదుర్చుకునేవారు. కానీ ఇప్పుడు పరిస్థితే వేరు. ప్రేమ పెళ్లులు, ఆలోచించకుండా తీసుకునే నిర్ణయాలు, కుటుంబ సమ్మతి లేకుండా జరిగే పెళ్లిళ్లు అన్నీ పెరుగుతున్నాయి. దీంతో కొన్ని పెళ్లిళ్లు చివరి నిమిషంలో రద్దవుతుంటే, మరికొన్ని పెళ్లయ్యాకే సమస్యలు తలెత్తి విడాకులు వరకూ వెళ్లిపోతున్నాయి.
తాజాగా మహారాష్ట్రలో జరిగిన ఒక ఘటన పెళ్లిళ్లకు కొత్త ప్రమాణాలు పెరిగినట్లు సూచిస్తోంది. ముర్తిజాపూర్కు చెందిన ఓ యువతి, అదే ప్రాంతానికి చెందిన యువకుడితో పెళ్లికి సిద్ధమైంది. అన్ని ఏర్పాట్లు పూర్తయి, ముహూర్తం కూడా ఖరారయ్యింది. కానీ పెళ్లి దగ్గర పడుతున్న సమయంలో వధువు మేనమామ వరుడి సిబిల్ స్కోరు తనిఖీ చేయించగా, వరుడు పలు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్నట్లు, అంతేకాకుండా అతని క్రెడిట్ స్కోరు తక్కువగా ఉన్నట్లు తెలిసింది.
దీంతో వధువు కుటుంబం పెళ్లి చేయడాన్ని తిరస్కరించింది. వరుడు ఆర్థికంగా స్థిరంగా లేడని, పెళ్లయ్యాక తమ బిడ్డను సరిగ్గా చూసుకోలేడని భావించి, చివరి నిమిషంలో పెళ్లిని రద్దు చేశారు. ఈ ఘటన సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
కొంతమంది ఈ నిర్ణయాన్ని సమర్థిస్తుండగా, మరికొందరు పెళ్లికి సిబిల్ స్కోరు ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఒక్క క్రెడిట్ స్కోరు ఆధారంగా ఒక వ్యక్తి భవిష్యత్తును అంచనా వేయడం న్యాయమా? లేకపోతే ఇది వధువు కుటుంబం తీసుకున్న ముందస్తు జాగ్రత్తా? ఇలాంటి ప్రశ్నలు నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి.
ఈ ఘటన చూస్తే, భవిష్యత్తులో పెళ్లిళ్లకు సరికొత్త అర్హత ప్రమాణాలు అమలుకావచ్చని అర్థమవుతోంది. సంపాదన, ఉద్యోగ భద్రత, ఆస్తులు మాత్రమే కాదు, ఇప్పుడు క్రెడిట్ స్కోరు కూడా పెళ్లి సంబంధాల్లో కీలకంగా మారుతుందా? అనే సందేహాలు కలుగుతున్నాయి.