గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తనపై సొంత పార్టీలోనే జరుగుతున్న వేధింపుల గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. 2014లో బీజేపీలో చేరినప్పటి నుండి వేధింపులను భరిస్తున్నానని, ఇక సహించలేకపోతున్నానని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీకి తాను అవసరం లేకుంటే వెళ్లిపోవడానికి సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నారు.
గోల్కొండ జిల్లా బీజేపీ అధ్యక్ష పదవి ఎస్సీ లేదా బీసీ సామాజిక వర్గానికి చెందిన నేతకు ఇవ్వాలని తాను సూచించినప్పటికీ, ఎంఐఎంతో సంబంధాలు ఉన్న వ్యక్తికి పదవి కట్టబెట్టారని రాజాసింగ్ విమర్శించారు. ఈ అంశంపై ఒక కీలక నేతను సంప్రదించినప్పుడు, ఆ నిర్ణయం గురించి తెలియదని సమాధానం ఇవ్వడం తనపై జరుగుతున్న కుట్రను బయటపెట్టిందని అన్నారు.
ఇప్పటి వరకు తాను బీఆర్ఎస్, ఎంఐఎం, కాంగ్రెస్ పార్టీలతో పోరాటం చేసినప్పటికీ, ఇప్పుడు సొంత పార్టీతోనే పోరాడాల్సిన స్థితి రావడం దురదృష్టకరమని రాజాసింగ్ వ్యాఖ్యానించారు. పార్టీ ఎమ్మెల్యే, ఎంపీ సూచించిన వ్యక్తికి జిల్లా అధ్యక్ష పదవి కట్టబెట్టడం సర్వసాధారణం అయినప్పటికీ, తన సూచనను ఎందుకు పక్కనపెట్టారో పార్టీ పెద్దలు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
తెలంగాణలో బీజేపీ జిల్లా అధ్యక్షుల నియామకం ఇటీవల చిచ్చు రేపిన విషయం తెలిసిందే. సీనియర్ నేతలు ఈ విషయంలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తాజాగా రాజాసింగ్ చేసిన విమర్శలు మరింత దుమారం రేపుతున్నాయి. తన సూచనలను విస్మరించి, ముస్లిం మైనారిటీ పార్టీలతో సంబంధాలు ఉన్న వ్యక్తికి పదవి కట్టబెట్టడం ఏంటని ప్రశ్నించారు.
రాజాసింగ్ తన ధర్మయుద్ధం కొనసాగిస్తానని స్పష్టం చేశారు. అయితే, పార్టీలో కొందరు బ్రోకర్ల మాదిరిగా వ్యవహరిస్తున్నారని, వారి కారణంగా బీజేపీ రాష్ట్రంలో వెనుకబడుతోందని అన్నారు. ఇలాంటి రిటైరైన వ్యక్తులు పార్టీలో కొనసాగితే బీజేపీ తెలంగాణలో అధికారంలోకి రావడం అసాధ్యమని ఆయన వ్యాఖ్యానించారు. రాజాసింగ్ వ్యాఖ్యలపై పార్టీ పెద్దలు ఎలా స్పందిస్తారో వేచిచూడాలి.