తిరుమల లడ్డూ కేసు విచారణలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. సుప్రీం కోర్టు ఆదేశాలతో ఏర్పాటైన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) కీలక ఆధారాలను సేకరించింది. ఇప్పటికే నలుగురిని అరెస్ట్ చేసి, ఈ విచారణలో పాత్రధారులను గుర్తించింది. నిందితుల నుంచి మరింత సమాచారం రాబట్టేందుకు సూత్రధారులపై దృష్టి పెట్టింది. ఈ కేసులో పాలకమండలి కీలక సభ్యుడిని, ఓ ముఖ్య అధికారిని విచారణకు పిలిచేందుకు నోటీసులు జారీ చేయనున్నారు.
కలకలం రేపిన తిరుమల లడ్డూ కల్తీ ఘటన విచారణలో కొత్త అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు సిట్ దర్యాప్తు వేగవంతం చేసింది. ఇప్పటి వరకు 12 మంది టీటీడీ అధికారులతో పాటు ఇతరుల ప్రమేయం ఉన్నట్లు గుర్తించింది. కీలక బాధ్యతలు నిర్వహించిన ఇద్దరు ప్రముఖులను విచారణకు పిలిచేందుకు సిట్ సిద్ధమవుతోంది. మరిన్ని అరెస్టులు జరిగే అవకాశముందని భావిస్తున్నారు. ఇప్పటికే ఏఆర్ డెయిరీ ఎండీ రాజశేఖర్, భోలేబాబా డెయిరీ డైరెక్టర్లను అరెస్టు చేసి, కస్టడీలోకి తీసుకుని విచారణ కొనసాగుతోంది.
విచారణ సందర్భంగా అరెస్టైన నలుగురినీ వేర్వేరుగా ప్రశ్నించినా అందరూ ఒకే విధంగా సమాధానం ఇవ్వడం అనుమానాలకు తావిస్తోంది. విచారణ సమయంలో పలు సందర్భాల్లో నిందితులే సిట్ అధికారులను ఎదురు ప్రశ్నించారనే సమాచారం ఉంది. ఏఆర్ డెయిరీ సరఫరా చేసిన నాలుగు నెయ్యి ట్యాంకర్లను తిరస్కరించిన విషయాన్ని టీటీడీ ఎప్పుడు తెలియజేసిందనే కోణంలో సిట్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే, తాము టీటీడీకి నెయ్యి సరఫరా చేయలేదని నిందితులు సమాధానం ఇవ్వడం గమనార్హం. నాణ్యతలేమి కారణంగా టీటీడీ నెయ్యిని తిరస్కరించిందని వైష్ణవి డెయిరీ ప్రతినిధుల నుంచి ఫోన్ ద్వారా సమాచారం అందిందని నిందితులు పేర్కొన్నట్లు తెలుస్తోంది.
సిట్ దర్యాప్తు ప్రధానంగా కల్తీ నెయ్యి సరఫరా వ్యవహారంపై దృష్టి సారించింది. నిందితులను వేర్వేరుగా ప్రశ్నించినా అందరూ ఒకే విధంగా సమాధానం ఇవ్వడం, ఇది ముందస్తు ప్రణాళిక ప్రకారం జరిగిన కల్తీ వ్యవహారమా? లేక దర్యాప్తును తప్పుదోవ పట్టించడానికి కావాలనే ఇచ్చిన సమాధానాలా? అనే కోణంలో విచారణ జరుగుతోంది. ప్రాథమిక దర్యాప్తులో 12 మంది టీటీడీ అధికారుల ప్రమేయం ఉన్నట్లు సిట్ గుర్తించింది. టీటీడీకి నెయ్యి సరఫరా చేసిన డెయిరీ కంపెనీల తీరుపై దర్యాప్తు కొనసాగుతోంది.
కేసును సీబీఐ సమీక్షించేందుకు సిద్ధమవుతోంది. సిట్ ఇప్పటివరకు సేకరించిన ఆధారాలను పరిశీలించిన సీబీఐ, భవిష్యత్ విచారణ కోసం మార్గదర్శకాలు రూపొందిస్తోంది. మరిన్ని కీలక వ్యక్తులను విచారణకు పిలవాలని భావిస్తోంది. ఈ కేసు రాజకీయ వర్గాల్లోనూ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పాలకమండలి సభ్యులు, టీటీడీ ఉన్నతాధికారులు విచారణ తీరుపై నిశితంగా గమనిస్తున్నారు.
తిరుమల లడ్డూ కల్తీ కేసు విచారణలో ప్రతి దశలో కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ విచారణకు మరింత గడువు పట్టొచ్చని, అన్ని కోణాల్లో ఆధారాలతో విచారణ పూర్తి చేసి, దోషులను బయటపెట్టేందుకు అధికారులు కసరత్తు కొనసాగిస్తున్నట్లు సమాచారం. మరిన్ని అరెస్టులు, కీలక మలుపులు ఎదురయ్యే అవకాశం ఉంది. అధికారుల ప్రమేయం ఉంటే, వారికి ఎలాంటి శిక్షలు ఎదురవుతాయి? ఈ కేసు ఇంకా ఏవైనా దిగ్భ్రాంతికర విషయాలను బయటపెడుతుందా? ఇవన్నీ తేలాలంటే మరికొంత కాలం వేచి చూడాల్సిందే.