అమెరికా అక్రమ వలసదారుల బహిష్కరణను వేగవంతం చేసింది. భారతదేశం నుంచి అక్రమంగా వెళ్లిన వలసదారులను సైనిక విమానాల్లో తిరిగి పంపించే ప్రక్రియ కొనసాగుతోంది. గత రెండు వారాల్లో ఇప్పటికే మూడు విడతలుగా 332 మంది భారతీయులు అమెరికా నుండి స్వదేశానికి పంపించబడ్డారు.
తాజాగా, ఆదివారం రాత్రి 10 గంటల సమయంలో 112 మందితో కూడిన సీ-17 సైనిక విమానం అమృత్‌సర్ విమానాశ్రయంలో ల్యాండ్ అయింది. ఈ బృందంలో 44 మంది హర్యానా, 33 మంది గుజరాత్, 31 మంది పంజాబ్‌కు చెందినవారు ఉన్నారు. అలాగే, ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌కు చెందిన ఒక్కొక్కరు ఉన్నారు. వీరిలో ఇద్దరు శిశువులు, 19 మంది మహిళలు, 14 మంది మైనర్లు ఉన్నారని అధికారులు వెల్లడించారు.
ఫిబ్రవరి 5న మొదటి విడతలో 104 మంది, రెండో విడతలో 116 మంది తిరిగి వచ్చారు. శనివారం సాయంత్రం వచ్చిన మరో విమానంలో 119 మంది ఉన్నారు. వీరిలో 67 మంది పంజాబ్‌కు, 33 మంది హర్యానాకు చెందిన వారున్నారు. మిగిలిన ఎనిమిది మంది గుజరాత్, ముగ్గురు ఉత్తరప్రదేశ్, గోవా, మహారాష్ట్ర, రాజస్థాన్‌కు ఇద్దరిద్దరు, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్‌కు ఒక్కొక్కరు ఉన్నారు.
అక్రమ వలసదారులను మానవీయంగా చూడాలని భారత విదేశీ వ్యవహారాల శాఖ కోరినా, అమెరికా అధికారులు వారిని సంకేళ్లతో కట్టేసి భారత్‌కు తరలించినట్లు సమాచారం. “కాళ్లకు గొలుసులు వేసి, చేతులను బంధించారు. ముగ్గురు మహిళలకు, ఇద్దరు చిన్నారులకు మాత్రం సంకెళ్లు వేయలేదు” అని పంజాబ్‌కు చెందిన దల్జీత్ సింగ్ తెలిపారు. అయితే, అమృత్‌సర్‌లో దిగే ముందు వారికి విముక్తి కల్పించారని చెప్పారు. కాంగ్రెస్ నేత శశి థరూర్ ఈ వ్యవహారాన్ని తీవ్రంగా ఖండించారు. వలసదారులకు సంకెళ్లు వేయడం మానవ హక్కుల ఉల్లంఘన అని ఆయన విమర్శించారు.
అమృత్‌సర్‌లో ల్యాండింగ్‌పై వివాదం
ఈ విమానాలను ఢిల్లీ లేదా ఇతర నగరాల విమానాశ్రయాలకి కాకుండా ప్రత్యేకంగా అమృత్‌సర్‌లోనే ల్యాండ్ చేయడంపై పంజాబ్ సీఎం భగవంత్ మాన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. “పవిత్ర నగరాన్ని బహిష్కరణ కేంద్రంగా మార్చొద్దు. అమృత్‌సర్‌లో స్వర్ణ దేవాలయం, దుర్గియానా మందిర్, జలియన్‌వాలా బాగ్, గోవింద్‌గఢ్ కోట వంటి ప్రఖ్యాత స్థలాలు ఉన్నాయి. అక్రమ వలసదారుల విమానాలను ఇక్కడే దిగిపించడాన్ని పంజాబ్ ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నంగా చూస్తున్నాం” అని సీఎం మాన్ వ్యాఖ్యానించారు.
భగవంత్ మాన్ వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. “అక్రమ వలసదారుల అంశాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ రాజకీయం చేస్తోంది. పంజాబ్ నుంచి యువత అమెరికాకు అక్రమంగా ఎందుకు వెళ్లాల్సి వస్తోంది అనే అంశాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలి” అని బీజేపీ నేత తరుణ్ చుగ్ అన్నారు.