తెలంగాణలో ఈసారి వేసవి మాంచిగా ముందే ప్రారంభమైంది. ఫిబ్రవరి నెలలోనే ఎండలు ఓ రేంజ్‌లో దంచి కొడుతున్నాయి. ఉదయం 9 గంటలు దాటితేనే నిప్పుల కొలిమిలా మారిపోతోంది. ఇంట్లో నుండే బయట అడుగుపెట్టాలన్నా ప్రజలు భయపడుతున్నారు. సాయంత్రం 7 గంటల వరకు కూడా వేడి తగ్గకపోవడంతో, ప్రజలంతా కూలర్లు, ఫ్యాన్లు, ఏసీలకు అతుక్కుపోతున్నారు.
ఈ భగ్గుమంటూ మండే ఎండల్లో, బీరు తాగడం మందుబాబులకు ఓ ఉపశమన మార్గంగా మారుతోంది. అయితే, ప్రస్తుతం బీరు ధరలు పెరిగిపోవడంతో, తాగాలనుకున్నా వెనుకంజ వేస్తున్నారు. ఈ నేపథ్యంలో బీరు ప్రియులు తమ డిమాండ్‌ను ప్రభుత్వానికి వినిపిస్తున్నారు. బీర్ల ధరలను రూ. 100కి తగ్గించాలని ప్రభుత్వాన్ని కోరుతూ, ప్రజావాణి కార్యక్రమంలో ఏకంగా అర్జీ పెట్టారు. ఈ డిమాండ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
సాధారణంగా వేసవిలో బీర్ల అమ్మకాలు విపరీతంగా పెరుగుతాయి. ఏ కంపెనీ బీరు అయినా చల్లగా ఉంటే చాలు అనే అభిప్రాయంలో బీరు ప్రియులు ఉంటారు. గతంలోనూ తీవ్ర ఎండల కారణంగా బీరు కొనుగోళ్లు పెరిగి, కొన్నిసార్లు స్టాక్ అయిపోవడం కూడా జరిగింది. గత ఏడాది కింగ్ ఫిషర్ బీరు సరఫరాలో సమస్య ఏర్పడడంతో, బీరు ప్రియులు నిరసన వ్యక్తం చేశారు. దీంతో ఎక్సైజ్ శాఖ స్పందించి వెంటనే సరఫరా పునరుద్ధరించింది.
తాజాగా, తెలంగాణలో బీర్ల ధరలు పెరిగాయి. ముఖ్యంగా కింగ్ ఫిషర్ బీరు కంపెనీ ధరలు పెంచడం వల్ల కొద్దిరోజుల పాటు రాష్ట్రానికి సరఫరా నిలిచిపోయింది. చివరికి ప్రభుత్వం జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించింది. దీనితో బీరు ప్రియులు హమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే, రానున్న వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని, బీర్లను రూ. 100 ధరకు అందించాలన్న డిమాండ్‌ను ప్రజావాణిలో సమర్పించారు.
ప్రజావాణిలో వచ్చిన ఈ వినూత్నమైన అర్జీని అధికారులు స్వీకరించినప్పటికీ, ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. బీరు ప్రియులు తమ డిమాండ్ నెరవేరకపోతే, సంఘం ఏర్పాటు చేసి ఉద్యమిస్తామని హెచ్చరించారు. దీంతో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అన్నది ఆసక్తికరంగా మారింది.
ఈ డిమాండ్‌కు సామాన్యులు, కొందరు మద్యం ప్రియులు మద్దతు తెలుపుతున్నారు. మండే ఎండలకు ఒకటికి బదులు రెండు బీర్లు త్రాగే వారికి ధరల పెరుగుదల పెద్ద సమస్యగా మారిందని వారు పేర్కొంటున్నారు. మొత్తంగా, వేసవి పూర్తిగా రాకముందే ఈ డిమాండ్ నెరవేరుతుందా లేదా అన్నది వేచి చూడాల్సిందే!