ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ జగన్ బాబాయి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ముఖ్య సాక్షి అయిన వివేకా ఇంటి వాచ్‌మన్ రంగన్న బుధవారం సాయంత్రం మరణించారు.
రంగన్నకు శ్వాసకోశ సమస్యలు ఉండేవి. రెండు వారాల క్రితం కిందపడటంతో ఆయన కాలికి గాయమైంది. అప్పటి నుంచి అనారోగ్యంతో బాధపడుతూ పులివెందులలోని తన ఇంటిలోనే ఉన్నారు. బుధవారం మధ్యాహ్నం ఆరోగ్యం మరింత విషమించడంతో కుటుంబ సభ్యులు వెంటనే కడప రిమ్స్‌కు తరలించారు. అయితే, అక్కడ చికిత్స పొందుతూ ఆయన ప్రాణాలు కోల్పోయారు. గతంలో ఈ కేసుకు సంబంధించి మరికొందరు సాక్షులు అనుమానాస్పదంగా మరణించిన నేపథ్యంలో, రంగన్న మృతదేహానికి పోలీసులు పోస్టుమార్టం చేయించాలని నిర్ణయించారు.
పోలీసులే కారణమని రంగన్న భార్య ఆరోపణ
రంగన్న భార్య సుశీలమ్మ తన భర్త మృతికి పోలీసులే కారణమని ఆరోపించారు. ‘‘పోలీసులు, సీబీఐ వేధింపుల వల్లే నా భర్త అనారోగ్యానికి గురయ్యాడు. గత ఆరేళ్లుగా మా ఇంటి ముందు పోలీసులు కాపలా ఉన్నారు. నా భర్త మంచంపైనే ఉండిపోయాడు, కానీ పోలీసులెవరూ సరైన చికిత్స చేయించలేదు. అసలు తప్పుచేసింది ఒకళ్లు, కానీ శిక్ష నా భర్తకు పడింది,’’ అని ఆమె వాపోయారు.
2019లో వైఎస్ వివేకా హత్య తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఘటన. అప్పటి నుంచి ఈ కేసు మిస్టరీగానే మారింది. ఇప్పటికే కీలక సాక్షులైన శ్రీనివాస్ రెడ్డి (2019) మరియు గంగాధర్ రెడ్డి (2022) అనుమానాస్పదంగా మరణించారు. ఇప్పుడు రంగన్న మరణంతో ఈ కేసులో మరింత ఉత్కంఠ నెలకొంది.