కొబ్బరినూనెతో అందం, ఆరోగ్యం మెరుగుపరుచుకోవచ్చు..

కొబ్బరి నూనె శిరులు, శరీరం పోషణకే కాదు ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవచ్చని పరిశోధనలు చెబుతున్నాయి. ఇందులో విటమిన్ E, K తో పాటు పాటు ఐరన్ వంటి మినరల్స్ కూడా పుష్కలంగా ఉన్నాయి. రక్తపోటు, మధుమేహం రోగులకు కూడా కొబ్బరి నూనె మంచిదే. కొబ్బరి నూనె వల్ల గుండెకు మేలు చేసే మంచి కొవ్వు కూడా పెరుగుతుందని తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది.

కొబ్బరి నూనెను కొన్ని శతాబ్దాల నుంచి సౌందర్య అవసరాలకు వాడుతున్నారు. ఎలాంటి చర్మం కలవారైనా కొబ్బరి నూనెను మాయిశ్చరైజర్‌గా ఉపయోగించవచ్చు. ముడతలు, చర్మం పగుళ్లను ఇది నియంత్రిస్తుంది. దక్షిణాది రాష్ట్రాల్లో ఎక్కువ మంది కొబ్బరి నూనెను జుట్టుకు వాడతారు. దీనివల్ల జట్టు బాగా పెరగడంతో పాటు పోషకాలు అందుతాయి. రసాయనాలు లేని సహజ హెయిర్ కండిషనర్‌గా కొబ్బరి నూనె పనిచేస్తుంది.

ఇందులోని లోరిక్ యాసిడ్.. మోనో లోరిన్‌గా పరివర్తన చెంది బ్యాక్టీరియా, వైరస్‌లతో పోరాడుతుంది. జ్వరాలు, వ్యాధుల నుంచి దూరంగా ఉంచుతుంది. కొబ్బరి నూనె జీర్ణక్రియకు తోడ్పడటమే కాకుండా, పేగుల సమస్య నుంచి రక్షిస్తుంది. అజీర్ణం కలిగించే వివిధ బ్యాక్టీరియాలు, ఫంగస్‌లతో పోరాడుతుంది.

అర టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె, అర టేబుల్ స్పూన్ నిమ్మరసం, ఒక టేబుల్ స్పూన్ పెరుగును తీసుకోవాలి. ముందుగా ఒక గిన్నెలో కొబ్బరి నూనె, నిమ్మరసం బాగా కలుపుకోవాలి. ఇందులో పెరుగును కలిపి మిశ్రమంలా తయారు చేసుకోవాలి . ఇప్పుడు దీనిని ముఖానికి అప్లై చేసి ఆరిపోయేంతవరకు ఉంచుకొని, ఆ తరువాత కడిగేసుకుంటే జిడ్డు వదిలి ముఖం మిలమిలా మెరిసిపోతోంది.

ఒక అవకాడో, 4 టేబుల్ స్పూన్ల కొబ్బరినూనె, రెండు టీ స్పూన్ల జాజికాయపొడి ఒక గిన్నెలో వేసి పేస్టులా తయారు చేసుకోవాలి. దీనిని ముఖానికి అప్లై చేసుకుని పదిహేను నిమిషాల తర్వాత కడిగేసుకుంటే చర్మంపై ఉన్న ముడతలు పోయి, చర్మం బిగుతుగా మారుతుంది. మరోవైపు చర్మాన్ని కాంతివంతంగా మార్చడంలోనూ కొబ్బరి నూనెకు ఏది సాటి రాదని నిపుణులు చెబుతున్నారు.

ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె ఒక టీ స్పూను బేకింగ్ పౌడర్ లను కలిపి ముఖానికి అప్లై చేసి పదిహేను నిమిషాల తరువాత చల్లటి నీటితో కడిగేసుకోవాలి. తెల్లటి టవల్ పెట్టి ముఖం తుడుచుకుంటే బ్లాక్ హెడ్స్ అన్ని టవల్ కి అంటుకుంటాయి.సహజ పద్ధతుల్లో బరువు తగ్గేందుకు కొబ్బరి నూనె సహకరిస్తుంది. ఇది జీవక్రియను పెంపొందించడంతో పాటు థైరాయిడ్, ఎండోక్రైన్ గ్రంధులు సక్రమంగా పనిచేయడానికి దోహదం చేస్తుంది. రోగ నిరోధక శక్తి పెంపొందిస్తుంది.