ఎస్‌ఎల్‌బీసీ రెస్క్యూలో పురోగతి..బురదలో మానవ అవశేషాలు

ఎస్‌ఎల్‌బీసీ సొరంగ ప్రమాదం జరిగి 16 రోజులు అయింది. అయినా నేటికీ గల్లంతయిన 8మంది ఆచూకీ తెలియలేదు. దీంతో ఆ కుటుంబ సభ్యుల వేదన వర్ణనాతీతంగా ఉంది. వారం రోజుల వరకూ ఎక్కడో మిణుకుమిణుకుమన్న ఆశ రోజులు గడుస్తున్న కొద్దీ సన్నగిల్లిపోయింది. చివరకు వారి డెడ్ బాడీలను చూసే అవకాశం కూడా ఉండదేమో అన్నట్లుగా పరిస్థితులు మారిపోయాయి.

ఇక ఇటు ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ లో గల్లంతైన వారి కోసం 16 రోజుల రెస్క్యూ ఆపరేషన్ తర్వాత కొంచెం పురోగతి కనిపించింది.కేరళ కెడావర్ డాగ్స్ గుర్తించిన ప్రాంతాల్లో తవ్వకాలు జరుగుతుండటంతో.. సొరంగం చివర బురదలో మానవ అవశేషాలు కనిపించినట్లు రెస్క్యూ టీమ్ చెబుతోంది. దీంతో మినీ జేసీబీలు, కన్వేయర్ బెల్ట్ సహాయంతో మరింత వేగంగా శిథిలాలను తొలగిస్తున్నారు. దీంతో TBM మిషన్ శకలాల తొలగింపు ప్రక్రియ వేగంగా జరుగుతోంది.

టన్నెల్‌లోని ఎండ్‌ పాయింట్‌ వద్ద బురదలో మనిషి చేతిని రెస్క్యూ టీమ్ గుర్తించినట్లు తెలుస్తోంది. అదే ప్రాంతంలో మరింత లోతుకు తవ్వితే మరింత ఆచూకీ లభించే అవకాశం ఉంది.ఇటు టన్నెల్‌లో మినీ జేసీబీలతో శిథిలాలు తొలగిస్తుండటం..అటు కన్వేయర్ బెల్ట్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి రావడం రెస్క్యూ ఆపరేషన్ కు కలిసి వస్తుంది. అయితే టన్నెల్ ఎండ్ పాయింట్ సమీపంలో TBM మిషన్ ముందు భాగమంతా బురదలో కూరుకుపోయింది. దీంతోTBM మిషన్ వెనుకభాగంలో శకలాల తొలగింపు వేగంగా సాగుతుంది. అయితే టీబీఎం మెషీన్‌లో మృతదేహం ఇరుక్కున్నట్టు నిర్ధారణ అయినా.. రెస్క్యూఆపరేషన్‌కు TBM మెషీన్ విడిభాగాలు అడ్డంకిగా మారాయి. దీంతో టీబీఎం మెషీన్‌ విడిభాగాలు కట్ చేసి.. లోపలికి వెళ్లడానికి రెస్క్యూ బృందాలు ప్రయత్నాలు చేస్తున్నాయి.