ఈ ఏడాది ఉగాది ఎప్పుడో తెలుసా?

మనమంతా కొత్త సంవత్సరం అంటే జనవరి 1వ తేదీ అనే అనుకుంటాం కానీ .మన హిందూ సాంప్రదాయం ప్రకారం కొత్త ఏడాది ఉగాదితో ప్రారంభం అవుతుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ,కర్ణాటక, తమిళనాడు, గోవా ప్రాంతాలలో ఉగాది పండుగను ఘనంగా జరుపుకొంటారు. ఉగాదిని మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ వంటి ప్రాంతాలలో గుడి పడ్వా అని కూడా అంటారు.

చాంద్రమాన క్యాలెండర్‌లోని చైత్రమాసంలో వచ్చే మొదటి రోజును ఉగాదిని జరుపుకుంటారు. గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం ప్రతి ఏడాది మార్చి చివరిలో లేదా ఏప్రిల్ మొదటి వారంలో ఈ పండుగ వస్తుంది. అలా ఈ ఏడాది మార్చి 30, ఆదివారం రోజు ఉగాది పండుగ వచ్చింది. కొత్త యుగం ప్రారంభాన్ని యుగాది అని అంటారు. యుగ అంటే సంవత్సరం ఆది అంటే ప్రారంభం కాబట్టి ..ఈ రెండు పదాలనుంచి యుగాది అనే పదం వచ్చింది. క్రమేపీ దానినే ఉగాదిగా పిలుచుకుంటున్నాము.

హిందూ పురాణాల ప్రకారం, బ్రహ్మ దేవుడు ముందుగా ప్రపంచాన్ని సృష్టించాడు. తరువాత రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాలను సృష్టించాడు. కాబట్టి, యుగాదిని ప్రపంచ సృష్టి మొదటి రోజుగా పురాణాలు చెబుతాయి. అలాగే ఉగాది రోజున షడ్రుచులతో ఉగాది పచ్చడిని తయారు చేసుకుంటారు.పండుగ యొక్క మరో ముఖ్యమైన ఘట్టం పంచాంగ శ్రవణం. ఆరోజు పూజారులు, జ్యోతిష్కులు లేదా కుటుంబ పెద్దలు..అన్ని రాశుల వారికి ఈ ఏడాది భవిష్యత్తు ఎలా ఉంటుందో చెబుతారు.

ఉగాది పండుగ రోజు సూర్యోదయానికి ముందు లేచి తలంటు పోసుకుని. కొత్త బట్టలు ధరిస్తారు. దేవాలయాలు, ఇళ్ళు, దుకాణాల ప్రవేశ ద్వారాలలో మామిడి ఆకులు, వేపాకులతో తోరణాలు కడతారు. ఈరోజు కొత్తగా ఏదైనా ప్రారంభించడానికి శుభ దినం కాబట్టి..ఉగాదికి కొత్త వ్యాపారాలు మరియు దుకాణాలు, మొదలైనవి ప్రారంభిస్తారు.