భారతదేశంలో యూపీఐ (UPI) రియల్-టైమ్ చెల్లింపు వ్యవస్థగా విస్తృతంగా ఉపయోగించబడుతోంది. మొబైల్ ఫోన్ ద్వారా తక్షణమే బ్యాంక్ ఖాతాల మధ్య డబ్బు బదిలీ చేసే ఈ సౌకర్యాన్ని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) అభివృద్ధి చేసింది. ఇప్పటివరకు యూపీఐ లావాదేవీలు పూర్తిగా ఉచితంగా ఉన్నప్పటికీ, తాజాగా వాటిపై ఛార్జీలు విధించే ప్రతిపాదనలు చర్చనీయాంశంగా మారాయి.
వ్యాపార లావాదేవీలపై ఛార్జీలు?
యూపీఐ ద్వారా జరిగే అధిక సంఖ్యలో లావాదేవీల కారణంగా, ప్రభుత్వం ఎన్‌పీసీఐ వ్యాపార లావాదేవీలపై రుసుము విధించాలని భావిస్తున్నాయి. 2022కి ముందు, వ్యాపారులు బ్యాంకులకు MDR ఛార్జీలు చెల్లించేవారు. అయితే, కేంద్ర ప్రభుత్వం 2022లో ఈ ఛార్జీలను రద్దు చేసింది. ఇప్పుడు, తిరిగి రూ. 2000 కంటే ఎక్కువ లావాదేవీలకు 1.1% సుంకం (UPI Surcharge) విధించాలని ప్రతిపాదన ఉంది.
కొందరికి ఉచితం, కొందరికి ఛార్జీలు
ప్రభుత్వ మద్దతు తగ్గడంతో యూపీఐ యాప్‌లు నష్టాన్ని పూడ్చుకునేందుకు కొత్త మార్గాలను అన్వేషిస్తున్నాయి. రూ. 40 లక్షల వార్షిక జీఎస్టీ టర్నోవర్ కలిగిన వ్యాపారులపై మాత్రమే ఛార్జీలు వసూలు చేయాలని యూపీఐ సంస్థలు భావిస్తున్నాయి. చిన్న వ్యాపారులు, మధ్య తరగతి వినియోగదారులకు పెద్దగా భారం పడకుండా చూడాలనే ఉద్దేశ్యంతో తక్కువ టర్నోవర్ ఉన్న వ్యాపారాలకు ఉచితంగా సేవలు అందించనున్నారు.
ప్రస్తుతం ఈ ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఒకవేళ ఈ ఛార్జీలు అమలులోకి వస్తే, వినియోగదారులపై ప్రత్యక్షంగా ప్రభావం తక్కువగా ఉన్నా, వ్యాపారులు అదనపు వ్యయాన్ని వినియోగదారులపై పరోక్షంగా మోపే అవకాశముంది. త్వరలో యూపీఐ ఛార్జీలపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.