కన్నడ నటి రన్యరావు బంగారం అక్రమ రవాణా కేసులో అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఈ కేసుపై డీఆర్ఐ (డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్) మరియు సీబీఐ ముమ్మరంగా దర్యాప్తు కొనసాగిస్తున్నాయి. రన్యరావు స్మగ్లింగ్ కేసులో ఒక్కొక్కరికి సంబంధించిన కీలక విషయాలు వెలుగుచూస్తున్నాయి. తాజాగా, ఈ కేసులో ఆమె భర్త జతిన్ హుక్కేరికి కర్ణాటక హైకోర్టులో ఉపశమనం లభించింది.
రన్యరావు కేసులో తనను అరెస్ట్ చేసే అవకాశం ఉందని భావించిన జతిన్, ముందుగా కోర్టును ఆశ్రయించారు. హైకోర్టు మార్చి 11న ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం, చట్టపరమైన ప్రక్రియను అనుసరించకుండా ఆయనను అరెస్ట్ చేయరాదని ఆదేశించింది. జతిన్ తన భార్య రన్యరావు అక్రమ రవాణా వ్యవహారంతో సంబంధం లేదని స్పష్టం చేశారు. డీఆర్ఐ అధికారులు అతడిని ఇప్పటికే రెండుసార్లు విచారించారని, విచారణకు పూర్తిగా సహకరించారని తెలిపారు. అయితే, పోలీసులు అనుమానంతో జతిన్‌ను అదుపులోకి తీసుకునే అవకాశముందని, అందుకే హైకోర్టును ఆశ్రయించారని సమాచారం.
ఇక రన్యరావు గోల్డ్ స్మగ్లింగ్ వ్యవహారం మరింత మలుపు తిరుగుతోంది. రన్య వివాహమైన రెండు నెలలకే ఆమె దుబాయ్ వెళ్లి తిరిగి రావడంతో, భర్త జతిన్‌కు అనుమానాలు వచ్చినట్లు తెలుస్తోంది. వీరిద్దరి మధ్య మనస్పర్థలు పెరిగాయని, రన్య తరచుగా విదేశాలకు వెళ్లడం వల్ల గొడవలు జరిగేవని చెబుతున్నారు. ఈ క్రమంలోనే జతిన్ తన భార్య అక్రమ కార్యకలాపాల గురించి ఒక మంత్రికి సమాచారం అందించినట్లు వార్తలు వస్తున్నాయి. ఆ మంత్రి డీఆర్ఐ అధికారులకు సమాచారం ఇచ్చి, ఈ కేసును వెలుగులోకి తెచ్చినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో రన్యరావు గోల్డ్ స్మగ్లింగ్ కేసు మరింత ఉద్రిక్తతను సంతరించుకుంది.