పెసరపప్పు ఆరోగ్యానికి ఎంతమంచిది అలాగే రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ముఖ్యంగా పెసరపప్పుతో చేసే ఆహార పదార్ధాలను చలికాలంలో కచ్చితంగా తినాలని పెద్దలు చెబుతూ ఉంటారు. అలాగే పెసరపప్పు హల్వా కూడా రోగ నిరోధకశక్తిని పెంచడంలో సాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. నేతితో చేసే ఈ హల్వా టేస్టుకు టేస్టు, హెల్త్‌కు హెల్త్ అందిస్తుంది.
పెసరపప్పు హల్వాకు కావలసిన పదార్థాలు..
పెసరపప్పు – ఒక కప్పు, నెయ్యి – ముప్పావు కప్పు, పాలు -ఒక కప్పు, పంచదార -ఒక కప్పు, యాలకుల పొడి – అర స్పూను, బాదం,పిస్తా తరుగు – ఒక స్పూను, కుంకుమపువ్వు – నాలుగు రేకులు,నీళ్లు – తగినన్ని
పెసరపప్పు హల్వా రెసిపీ
ముందుగా పెసరపప్పును 3 గంటల పాటు నానబెట్టేయాలి.ఇప్పుడు దాన్ని మిక్సీలో వేసి గట్టి పిండిలా రుబ్బుకోవాలి.నీళ్లు తక్కువగా వేసుకుంటే ఈ పిండి గట్టిగా వస్తుంది.తర్వాత ఒక గిన్నెలో ఒక టీ స్పూను పాలను వేసి అందులో కుంకుమపువ్వు రేకులను వేసి నానబెట్టాలి.స్టవ్ మీద కళాయి పెట్టి నెయ్యి వేసి అందులో ఈ పెసరపప్పు పేస్ట్ ను వేసి చిన్న మంట మీద వేసి మాడిపోకుండా కలుపుతూ ఉండాలి.
నలభై నిమిషాల పాటు మాడిపోకుండా వేయిస్తే.. అప్పుడు పెసరపప్పు ముద్ద గోల్డెన్ బ్రౌన్ రంగులోకి వస్తుంది.దీనిలో కాచి చల్లార్చిన ఒక కప్పు పాలను కూడా వేసి బాగా కలుపుకోవాలి.ఇది బాగా దగ్గరగా గట్టిగా అయ్యేవరకు కలపాలి. అందులోనే యాలకుల పొడిని, పంచదారను కూడా వేసి బాగా కలపాలి.కావాలనుకున్నవాళ్లు మామూలు పంచదారకు బదులు బ్రౌన్ షుగర్ కూడా వాడుకోవచ్చు.
పంచదార మొత్తం కరిగి హల్వాలో కలిసి దగ్గరగా అయ్యేవరకు స్టవ్ మీద ఉంచాలి.ఆ తర్వాత బాదం, పిస్తా తరుగులను వేసి కలుపుకోవాలి.పాలల్లో నానబెట్టిన కుంకుమపువ్వు రేకులను కూడా వేసి కలపాలి.ఈ మొత్తం మిశ్రమం దగ్గరగా అయ్యేవరకు కలిపి తర్వాత స్టవ్ ఆఫ్ చేస్తే..టేస్టీ పెసరపప్పు హల్వా రెడీ అయిపోతుంది.అయితే డయాబెటిస్ పేషెంట్లు ఈ హల్వా స్వీటుకు దూరంగా ఉంటే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.