భారత ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య పాలనాపరమైన వైరుధ్యాలున్నా కూడా.. అవకాశం ఉన్న ప్రతీ సారి మరోసారి ఒకరిపై ఒకరు అభిమానాన్ని చాటుకునే ప్రయత్నమే చేస్తారు. తాజాగా ఇదే జరిగింది. ఏఐ పరిశోధకుడు లెక్స్ ఫ్రిడ్‌మాన్ పాడ్‌కాస్ట్‌లో ప్రధాని మోదీ పాల్గొన్న ఒక ఇంటర్వ్యూను డోనాల్డ్ ట్రంప్ తన సోషల్ మీడియా నెట్‌వర్క్ ట్రూత్ సోషల్‌లో పంచుకున్నారు. ట్రంప్ వీడియో షేర్ చేసిన కొన్ని గంటల తర్వాత ప్రధాని మోదీ కూడా ట్రంప్ ట్రూత్ సోషల్ నెట్ వర్క్ లో జాయిన్ అయి తన మనసులోని మాట చెప్పుకొచ్చారు.
ట్రూత్ సోషల్‌లో చేరినందుకు తనకు ఆనందంగా ఉందని.. రాబోయే రోజుల్లో ఉద్వేగభరితమైన, అర్థవంతమైన సంభాషణల్లో పాల్గొనడానికి ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని ట్రూత్ సోషల్‌లో ప్రధాని మోదీ పోస్ట్ పెట్టారు. అలాగే తన పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూను ట్రూత్ సోషల్‌లో పంచుకున్నందుకు డొనాల్డ్ ట్రంప్‌నకు ప్రధాని ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.నా మిత్రుడు, అమెరికా అధ్యక్షులు ట్రంప్‌నకు ధన్యవాదాలని చెప్పిన మోదీ.. నా జీవిత ప్రయాణం, భారతదేశ నాగరికత దృక్పథం, ప్రపంచ సమస్యలు, మరిన్నింటితో సహా విస్తృత శ్రేణి అంశాలను తాను ఇక్కడ చర్చించానని ట్రంప్ ఇంటర్వ్యూను పంచుకున్న పోస్ట్‌కు ప్రధాని సమాధానమిచ్చారు.
కాగా ట్రంప్ షేర్ చేసిన.. లెక్స్ ఫ్రిడ్‌మాన్ పాడ్‌కాస్ట్‌లో ప్రధాని మోదీ ..అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాలన గురించి ట్రంప్‌తో తన స్నేహం గురించి చెప్పడంతో పాటు.. చాలా ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ట్రంప్ ఆ వీడియో షేర్ చేయడంతో.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో పరస్పర విశ్వాసం అనే బంధాన్ని పంచుకున్నానని..తమ ఇద్దరికీ జాతి ప్రయోజనాలే ముఖ్యమని ప్రధాని ట్రూత్ సోషల్‌లో వివరించారు .అలాగే ఇదే సర్వోన్నతమమని తామిద్దరం భావిస్తామని… అందుకేనేమో తమ ఇద్దరి మధ్య మంచి స్నేహం, అనుబంధం కొనసాగుతోందని చెప్పుకొచ్చారు. రెండోసారి అధికారంలోకి వచ్చిన ట్రంప్ మదిలో అమెరికా డెవలప్మెంట్‌పై స్పష్టమైన రోడ్‌మ్యాప్ ఉందన్న మోదీ… ట్రంప్ పై కాల్పులు జరిగిన సమయంలోనూ తాను.. ఆయనలో హుషారు, దృఢసంకల్పం చూశానంటూ ట్రంప్‌పై ప్రశంసల వర్షం కురిపించారు.