Micro Retirement: ఇదో కొత్త పోకడ.. 25 నుంచి 30 ఏళ్ల మధ్యనే రిటైర్మెంట్ ప్లాన్ చేస్తున్న యువత

ఈరోజుల్లో నేటి తరం యువత.. జనరేషన్ జి..పారంపర్య విధానాలను పక్కన పెట్టి కొత్త ట్రెండ్‌ను ప్రారంభిస్తోంది. అదే మైక్రో రిటైర్మెంట్. మైక్రో ఫైనాన్స్ గురించి చాలామందికి తెలుసు, కానీ మైక్రో రిటైర్మెంట్ అంటే ఏమిటా? గతంలో, ఒక వ్యక్తి పదివీధిలో అనేక సంవత్సరాలు పని చేసి, 60 ఏళ్ల వయస్సు వచ్చిన తర్వాతే రిటైర్మెంట్ తీసుకునేవారు. కానీ, నేటి యువత ఇందుకు భిన్నంగా ఆలోచిస్తోంది.. ఇప్పుడే బ్రేక్ తీసుకుని జీవితాన్ని ఆస్వాదించాలని భావిస్తోంది.

మైక్రో రిటైర్మెంట్ అంటే ఏమిటి?
కెరీర్ మంచి ఊపులో ఉన్నప్పుడే కొంతకాలం పని నుంచి విరామం తీసుకోవడమే మైక్రో రిటైర్మెంట్. ముఖ్యంగా 25 నుంచి 30 ఏళ్ల మధ్యనే ఈ విరామాన్ని ప్లాన్ చేసుకుంటున్నారు. మానసిక ఆరోగ్యం, పని ఒత్తిడిని తగ్గించుకోవడం అనేదే దీనికి ప్రధాన కారణం. టెన్షన్ భరించలేక కొందరు ఉద్యోగాలు వదులుకుంటున్నారు. కొందరు ప్రపంచాన్ని చుట్టివచ్చేందుకు, మరికొందరు కొత్త నైపుణ్యాలను అభ్యసించేందుకు ఈ బ్రేక్‌ను ఉపయోగిస్తున్నారు.

మైక్రో రిటైర్మెంట్ పుట్టుక
ఈ కాన్సెప్ట్ మొదటగా 2007లో టిమ్ ఫెర్రిస్ రాసిన The 4-Hour Workweek పుస్తకం ద్వారా పాపులర్ అయింది. కానీ, ఇటీవల ఇది ట్రెండ్‌గా మారడానికి యువతలో పెరుగుతున్న మానసిక ఆరోగ్య సమస్యలు, పని-వ్యక్తిగత జీవితం సమతుల్యతపై దృష్టి పెట్టడమే ముఖ్యమైన కారణాలు. “ఎందుకు 60 ఏళ్ల దాకా వేచి ఉండాలి? శక్తి, ఉత్సాహం ఉన్నప్పుడే ప్రపంచాన్ని అన్వేషించొచ్చు” అనే ఆలోచన వీరిలో బలపడింది.

మైక్రో రిటైర్మెంట్ నిజంగా లాభదాయకమేనా?
ఈ విధానం ద్వారా వ్యక్తులు తమ జీవితంపై మరింత నియంత్రణ పొందగలుగుతారు. అవసరమైనప్పుడు విరామాలు తీసుకుని, రీఫ్రెష్ అయి తిరిగి కెరీర్‌ను ప్రారంభించగలుగుతారు. అయితే మానసిక నిపుణుల ప్రకారం, దీని వల్ల ఉద్యోగాలపై ఆసక్తి తగ్గే అవకాశం ఉంది. స్థిరత్వం కోల్పోయే ప్రమాదం ఉంది. కానీ, ఈ విరామాన్ని సరైన ప్రణాళికతో ఉపయోగించుకుంటే, కొత్త నైపుణ్యాలను అభ్యసించి కెరీర్‌లో మరింత ఎదగవచ్చు.

మైక్రో రిటైర్మెంట్ తీసుకునే వారు జాగ్రత్తగా ఉండాల్సిన విషయాలు
పక్కా ప్లాన్ ఉండాలి: విరామం తర్వాత తిరిగి కెరీర్‌ను ఎలా ముందుకు తీసుకెళ్లాలో ముందుగానే తెలుసుకోవాలి.
ఆర్థికంగా సిద్ధంగా ఉండాలి: పొదుపులు లేకపోతే ఈ విరామం తీవ్ర నష్టాన్ని కలిగించవచ్చు.
సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి: కేవలం ఎంజాయ్‌మెంట్‌కు కాకుండా, కొత్త స్కిల్స్ నేర్చుకోవడం, వ్యక్తిగత అభివృద్ధి కోసం ఉపయోగించుకోవడం మంచిది.

మైక్రో రిటైర్మెంట్‌కు సిద్ధమా?
ఇది వ్యక్తిగత నిర్ణయం. కొందరికి ఇది ఎంతో మేలు చేస్తుంది, మరికొందరికి సమస్యలు తెచ్చిపెడుతుంది. మీరు దీన్ని ట్రై చేయాలనుకుంటే, ముందుగా ఆర్థిక స్థిరత, భవిష్యత్తు ప్రణాళికపై స్పష్టత కలిగి ఉండటం చాలా ముఖ్యం!