ఇండియా అనే పదాన్ని రాజ్యాంగంలో “భారత్” లేదా “హిందూస్థాన్”తో భర్తీ చేయాలన్న అంశంపై కీలక పరిణామం చోటుచేసుకుంది. ఢిల్లీ హైకోర్టు, 2020లో సుప్రీంకోర్టు ఈ అంశంపై ఇచ్చిన ఆదేశాలను పాటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు పిటిషనర్ తమ పిటిషన్‌ను ఉపసంహరించుకోవడానికి కోర్టు అనుమతి ఇచ్చింది. 2020లో సుప్రీంకోర్టు ఈ అంశాన్ని సమీక్షించాలని ప్రభుత్వాన్ని కోరినప్పటికీ, ఎటువంటి చర్యలు తీసుకోలేదని పిటిషన్లో పేర్కొన్నారు. ఈ మేరకు పలు అభ్యర్థనలు ఉన్నప్పటికీ, వాటిని ప్రభుత్వం విస్మరించిందని పిటిషనర్ తరఫున న్యాయవాది కోర్టుకు వెల్లడించారు.
కేంద్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో, ఈ అంశాన్ని ఢిల్లీ హైకోర్టు ఎదుట ఉంచడం తప్ప మరో మార్గం లేదని న్యాయవాది పేర్కొన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 1ని సవరించి, ఇండియా అనే పేరుకు బదులుగా భారత్ లేదా హిందూస్థాన్‌ను అధికారికంగా స్థాపించాలని కోరారు. ఇండియా అనే పేరు వలస పాలనకు సంకేతమని, ఇది దేశపు సాంస్కృతిక, చారిత్రక ప్రాముఖ్యతను పూర్తి స్థాయిలో ప్రతిబింబించదని వాదించారు.
పిటిషనర్ దాఖలు చేసిన వివరాల ప్రకారం, 1948 నవంబర్ 15న రాజ్యాంగ సభలో దేశపు అధికారిక పేరును నిర్ణయించే అంశంపై విస్తృత చర్చ జరిగింది. చివరికి, రాజ్యాంగ తుది ముసాయిదాలో ఇండియా మరియు భారత్ అనే రెండు పేర్లను అలాగే ఉంచారు. అయితే, పిటిషనర్ అభిప్రాయ ప్రకారం, దేశానికి ఒకే ఒక్క పేరు ఉండాలని, అది భారత్ లేదా హిందూస్థాన్ కావాలని కోర్టును కోరారు. ఈ వాదనలను పరిశీలించిన హైకోర్టు, సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం కేంద్రం తగిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది.