ఐపీఎల్ ఓపెనింగ్ సెర్మనీలో అదరగొట్టే సెలబ్రెటీలు వీరే..

ఐపీఎల్ ఓపెనింగ్ సెర్మనీకి సర్వం సిద్ధమవుతుంది. ఈ మెగా ఈవెంట్ 18వ ఎడిషన్ కు భారీగా ఏర్పాటు జరుగుతున్నాయి. ఈనెల 22న కోల్ కత్తాలోని ఈడెన్ గార్డెన్ వేదికగా ఓపెనింగ్ సెర్మనీ అంగరంగ వైభవంగా నిర్వహించడానికి బీసీసీ ప్లాన్ చేస్తోంది. ఈ ప్రారంభోత్సవ ఈవెంట్లో ప్రముఖ సెలబ్రిటీలు, మాజీ క్రికెటర్లు సందడి చేయనున్నారు..

భారత్‌లో జరిగే ధనాధన్ క్రికెట్‌కు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. క్రికెట్ అభిమానులకు మంచి కిక్కిచ్చే ఐపీఎల్ ఎల్లుండి నుంచి అంటే ఈనెల 22 నుంచి ప్రారంభం కాబోతుంది. 65 రోజుల పాటు 13 వేదికల్లో 74 మ్యాచులతో ఐపీఎల్ 18వ ఎడిషన్ జరగనుంది. ఈసారి కూడా టైటిల్ కోసం పది జట్లు ఢీ కొనబోతున్నాయి. డిఫెండింగ్ ఛాంపియన్ కోల్ కత్తా నైట్ రైడర్స్ బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ తొలి మ్యాచ్ లో తలపడనున్నాయి.

అంతకంటే ముందు ఈ సీజన్ ఓపెనింగ్ సెర్మనీని గ్రాండ్‌గా జరపడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. కోల్ కత్తా ఈడెన్ గార్డెన‌లో ఈవెంట్ నిర్వహించడానికి బీసీసీఐ ప్లాన్ చేస్తోంది. సాయంత్రం 6 గంటల నుంచి ఓపెనింగ్ సెర్మనీ జరగనుంది. ఈ ఓపెనింగ్ సెర్మనీలో బాలీవుడ్ స్టార్లు, హాలీవుడ్ స్టార్లు, మాజీ క్రికెటర్లు సందడి చేయనున్నారు. షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్, విక్కీ కౌశల్, వరుణ్ ధావన్ లాంటి స్టార్లు పాల్గొననున్నారు.

స్పెషల్ అట్రాక్షన్ గా బాలీవుడ్ బ్యూటీస్ దిశా పటాని, శ్రద్ధా కపూర్, ప్రియాంక చోప్రా, కత్రినా కైఫ్ తమ పర్ఫామెన్స్ తో అదరగొట్టనున్నారు. అలాగే సూపర్ సింగర్ శ్రేయ ఘోషల్ తన పాటలతో ప్రేక్షకులను ఉర్రూతలూగించనున్నారు. అర్జిత్ సింగ్, పంజాబ్ మ్యూజిక్స్ సెన్సేషన్ కరణ్ ఔజ్లా మంత్రముగ్ధుల్ని చేయనున్నారు. ఇక ఈ సెర్మనీ కి ఐసీసీ చైర్మన్ జై షాతోపాటు మాజీ క్రికెటర్లు పాల్గొనబోతున్నారు.

మరోవైపు గతంలో లేని విధంగా ఈసారి 13 వేదికల్లో ఓపెనింగ్ సెర్మనీ జరగనుంది. ఐపీఎల్ కు ఆతిథ్యం ఇస్తున్న అన్ని వేదికల్లో కూడా ఈ సెలబ్రేషన్స్ నిర్వహించాలని బీసీసీ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో టాలీవుడ్ స్టార్లు కుడా పార్టిసిపేట్ చేయనున్నారు. మొత్తంగా ఈ 18వ ఎడిషన్ మార్చి 22 నుంచి మే మే 25వ తేదీ వరకు జరగనుంది. లోకల్ టీం సన్ రైజర్స్ హైదరాబాద్ తన తొలి మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ తో పోటీ పడనుంది.

గత 17 సీజన్లలో ముంబై ఇండియన్స్ చెన్నై సూపర్ కింగ్స్ ఐదేసి సార్లు టైటిళ్లు సొంతం చేసుకున్నాయి. కోల కత్తా నైట్ రైడర్స్ మూడుసార్లు ఐపీఎల్ టైటిల్ గెల్చుకుంది. హైదరాబాద్ రెండుసార్లు విజేతగా నిలవగా.. రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్ చెరో సారి టైటిల్ దక్కించుకున్నాయి.కాగా ఇంతవరకు టైటిల్ గెలవని బెంగళూరు, ఢిల్లీ, పంజాబ్, లక్నో జట్లు ఈ ఎడిషన్ లో సత్తా చాటాలని ఆరాటపడుతున్నాయి.