కస్టమర్లకు షాకిస్తున్న ఓలా, ఉబర్, ర్యాపిడో డ్రైవర్లు

Ola Uber Rapido Drivers Shocking Customers

భాగ్యనగరంలో వీధివీధికి క్యాబ్ సర్వీసులు అందిస్తున్న ఉబర్, ఓలా,రాపిడో వంటి క్యాబ్ డ్రైవర్లు.. మరో షాకింగ్‌ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే శంషాబాద్ ఎయిర్ పోర్టుకు రైడ్స్ నిషేధించిన చేసిన క్యాబ్‌ డ్రైవర్లు.. ఇప్పుడు మరో నిరసనకు దిగారు. ఇకపై క్యాబ్‌లలో ఏసీ సదుపాయాన్ని కల్పించబోమని వెల్లడించారు. నిన్నటి నుంచి అంటే మార్చి 24 నుంచి ‘నో ఏసీ క్యాంపెయిన్’ పేరుతో ఎయిర్ కండిషన్డ్ రైడ్లను రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు.

కాగా తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన ప్రీ-పెయిడ్ టాక్సీ ఛార్జీలలాగానే ఏకరీతి రైడ్-ఫేర్ నిర్మాణాన్ని తప్పనిసరిగా స్వీకరించాలని.. తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్‌ఫామ్ వర్కర్స్ యూనియన్ డిమాండ్ చేస్తోంది. క్యాబ్ అగ్రిగేటర్ల అన్యాయమైన ధరలు ఆపేయాలని, ఇంధనం, నిర్వహణ ఖర్చును, క్యాబ్ డ్రైవర్ల సర్వీసులకు న్యాయమైన పరిహారాన్ని చెల్లించాలని కోరుతున్నారు.

గతేడాది ఏప్రిల్‌లో కూడా క్యాబ్ డ్రైవర్ల సంఘం ఇప్పటిలాగే నో ఏసీ ప్రచారాన్ని నిర్వహించింది. డ్రైవర్లు కి.మీటరుకు 10 రూపాయల నుంచి 12 రూపాయలు సంపాదిస్తారని, కానీ అదే క్యాబ్‌ను ఏసీ ఆన్‌లో ఉంచి నడపడానికి అయ్యే ఖర్చు కి.మీ.కు 16 రూపాయల నుంచి 18 రూపాయలుగా పేర్కొంది.నో ఏసీ ప్రచారంతో పాటు.. వివిధ మార్గాల ద్వారా క్యాబ్ అగ్రిగేటర్లు అన్యాయంగా ధరలు నిర్ణయించడాన్ని నిరసిస్తున్నట్లు తెలిపారు.

క్యాబ్ అగ్రిగేటర్లు, ప్రీ-పెయిడ్ టాక్సీలు వసూలు చేసే రైడ్-ఛార్జీలలో చాలా తేడా ఉందని, సుమారు 300 రూపాయల నుంచి 400 రూపాయల వరకూ తేడా ఉందని ఆయన అన్నారు. ఈ తేడా ఎయిర్‌పోర్టులలో ఎక్కువసేపు వేచి ఉండే సమయంతో పాటు.. తిరుగు ప్రయాణానికి అయ్యే మొత్తం 3 నుంచి 4 గంటల సమయం, అగ్రిగేటర్లకు చెల్లించే 30 శాతం కమీషన్‌తో కలిపి క్యాబ్ డ్రైవర్లకు తక్కువ ఆదాయం లభిస్తుంది. దీంతో ఇప్పటికే చాలా మంది ఓలా, ఉబర్, రాపిడో వంటి క్యాబ్ డ్రైవర్లు తమ వాహనాలను రోడ్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ కి అప్పగించాలని భావిస్తున్నారు.

ప్రస్తుతం వేసవి కాలం నడుస్తుంది. హైదరాబాద్‌లో రెండు రోజులుగా వాతావరణం కాస్త చల్లబడినా.. రికార్డు స్తాయిలో ఎండలు మండిపోతాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. దీంతో ప్రయాణం సమయంల కాసేపు అయినా వేడి గాలుల నుంచి , వేడి నుంచి తప్పించుకోవడానికి ఏసీ కావాలని అనుకుంటారు. కాగా ఇప్పుడు నో ఏసీ ప్రకటనతో ప్రయాణికులకు ఏసీ కష్టాలు తప్పవనే వాదన వినిపిస్తోంది.