తెలుగు రాష్ట్రాల ప్రజలకు అలెర్ట్..

తెలుగు రాష్ట్రాల్లో రెండు రోజులుగా కాస్త చల్లబడినా..మళ్లీ ఎండలు మండిపోతున్నాయి. ఉదయం తొమ్మిది దాటితే చాలు.. బయటకు వెళ్లలేని పరిస్థితి ఉంది. రెండు రాష్ట్రాల్లో 40 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలతో జనం అల్లాడుతున్నారు. ఒకవైపు ఎండ, మరోవైపు ఉక్కపోతతో ప్రజలు పట్టపగలే చుక్కలు చూస్తున్నారు. గత రెండు రోజులుగా ద్రోణి ప్రభావంతో కొన్ని ప్రాంతాల్లో చెదురుమదురుగా వర్షాలు కురవడంతో.. కాస్త ఉపశమనం కలిగినట్లయింది. అయితే ఈ రోజు నుంచి భానుడు మరింత ప్రతాపం చూపిస్తాడని వాతావరణ శాఖ పేర్కొంది.

దక్షిణ ఛత్తీస్‌గఢ్ నుంచి మధ్య మహారాష్ట్ర, ఉత్తర కర్ణాటక మీదుగా ఉత్తర తమిళనాడు వరకు సముద్రమట్టానికి 0.9 కి.మీటర్ల ఎత్తులో ద్రోణి కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ రోజు నుంచి క్రమేపి రెండు నుంచి మూడు డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని పేర్కొంది. తెలంగాణలోని అన్ని జిల్లాలలో కూడా వడగాలులు తీవ్రత పెరిగే అవకాశం ఉందని నేడు అంటే బుధవారం గరిష్టంగా అదిలాబాద్‌లో 39.3 కనిష్టంగా నల్లగొండలో 35 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయయని పేర్కొంది.

నిన్న తెలంగాణలోని ఆదిలాబాద్,ఖమ్మం, నిజామాబాద్, భద్రాచలం, మహబూబ్ నగర్లలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదయ్యాయి.. ఆదిలాబాద్లో 38.3 డిగ్రీలు, భద్రాచలంలో 38 డిగ్రీలు, నిజామాబాద్‌ .37.3 డిగ్రీలు, ఖమ్మంలో 36.6డిగ్రీలు, మహబూబ్ నగర్లో 35.5డిగ్రీలు, నల్లగొండలో 36డిగ్రీలు, రామగుండంలో 35.6డిగ్రీలు, మెదక్‌లో 35.4 డిగ్రీలు, హనుమకొండలో35డిగ్రీలు, హైదరాబాద్‌లో 33.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

మరోవైపు ఏపీలో కూడా ఎండలు ఠారెత్తిస్తున్నాయి. నేడు 108 మండలాల్లో తీవ్రవడగాలులు వీస్తున్నాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. అలాగే గురువారం 33 మండలాల్లో తీవ్ర వడగాల్పులు..206 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. ఎండల తీవ్రత పెరుగుతుండటంతో.. బయటకు వచ్చే వారు జాగ్రత్తలు పాటించాలని వాతావరణ శాఖ సూచించింది.