ఏపీలో వారికి ఫ్రీ కరెంట్..

ఏపీలో కూటమి ప్రభుత్వం ఇటీవల చేనేత కార్మికుల ఇళ్లకు ఉచిత కరెంట్ అందించాలని నిర్ణయించింది. తాజాగా దీనికి సంబంధించిన ఉత్తర్వులను విడుదల చేసింది. చేనేత మగ్గాలు ఉన్న ఇండ్లకు నెలకు 200 యూనిట్లు, పవర్ లూమ్స్ కు నెలకు 500 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ అందించబోతోంది కూటమి ప్రభుత్వం. 93 వేల చేనేత మగ్గాలు, పదివేల మర మగ్గాలు ఉన్న చేనేత కార్మికులకు ప్రభుత్వ నిర్ణయంతో లబ్ధి చేకూరనుండటంతో వారంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో చేనేత కార్మికులకు ఫ్రీగా విద్యుత్ ఇవ్వడానికి సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. చేనేత కార్మికుల ఇళ్లకు 200 యూనిట్లు, పవర్ లూమ్స్ కు 500 యూనిట్లు వరకు ప్రతి నెలా ఫ్రీ కరెంట్ ఇవ్వడానికి నిర్ణయం తీసుకున్నారు. చేనేత రంగానికి తమ వంతు ప్రోత్సాహాన్ని అందించాలనే ఉద్దేశంతో పాటు.. ఎన్నికల సమయంలో తాము ఇచ్చిన హామీని నెరవేరుస్తూ.. ఉచిత విద్యుత్ అమలుకు నిర్ణయం తీసుకుంది ఏపీ ప్రభుత్వం.
దీంతో అధికారులు జిల్లాల యంత్రాంగాలు కసరత్తు ప్రారంభించి.. జిల్లాల వారీగా లబ్ధిదారులను గుర్తించే పనిలో ఉన్నారు.

కాగా ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంపై చేనేత కార్మికుల నుంచి హర్షం వ్యక్తం అవుతోంది. ఉచిత కరెంట్ నిర్ణయంతో వేలాది చేనేత కుటుంబాలపై ఆర్థిక భారం తగ్గనుందని కార్మికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఎస్సీ, ఎస్టీలకు ఏపీ ప్రభుత్వం ఉచితంగా కరెంటును అందిస్తోంది. ఇప్పుడు ఆ జాబితాలోకి చేనేత కార్మికులు చేరారు.

అయితే ఎస్సీ, ఎస్టీలకు ఉచిత విద్యుత్ ఇవ్వడానికి బదులు.. సౌర విద్యుత్ అందించాలని నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం ..పీఎం సూర్య ఘర్ పథకం కింద సోలార్ విద్యుత్ అందించే ఏర్పాట్లను చేస్తోంది. దీనికి సంబంధించి దరఖాస్తుల ప్రక్రియ కూడా వేగంగా జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ విషయంలో ప్రత్యేక దృష్టితో ఉంది. మొత్తానికి ఏపీలో ప్రత్యేక తరగతుల వారికి ఉచితంగా విద్యుత్ అందించి పేదల ప్రభుత్వంగా వారికి అండగా నిలుస్తుందన్న వాదన వినిపిస్తోంది.