లక్నో చేతిలో ఓటమి: పిచ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన ప్యాట్‌ కమిన్స్

లక్నో సూపర్‌ జెయింట్స్‌ చేతిలో ఓటమి సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ కెప్టెన్‌ ప్యాట్‌ కమిన్స్‌కు నిరాశను మిగిల్చింది. తొలిమ్యాచ్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌పై 286 పరుగుల భారీ స్కోర్ సాధించి ఐపీఎల్‌ చరిత్రలో రెండో అతి పెద్ద స్కోర్‌గా నిలిచిన ఎస్‌ఆర్‌హెచ్‌, అదే గ్రౌండ్‌లో లక్నోతో తలపడినప్పుడు మాత్రం ఫామ్‌ను కొనసాగించలేకపోయింది. 190 పరుగులకే పరిమితమై, తమ స్థాయికి తగ్గ ఆటతీరును ప్రదర్శించలేకపోయింది. టీ20ల్లో 190 పెద్ద స్కోరే అయినప్పటికీ, ఎస్‌ఆర్‌హెచ్‌ బ్యాటింగ్ శైలికి అది తక్కువగానే అనిపించింది. పైగా, లక్నో 16.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేధించడం అభిమానులను మరింత నిరాశకు గురి చేసింది.

ఈ మ్యాచ్ అనంతరం కెప్టెన్‌ ప్యాట్‌ కమిన్స్‌ స్పందిస్తూ, లక్నో బౌలర్లు అద్భుతంగా రాణించారని పేర్కొన్నారు. రాజస్థాన్‌తో ఆడిన వికెట్‌ మరియు ఈ మ్యాచ్‌లోని వికెట్‌ భిన్నమని చెప్పారు. తాము వేగంగా పరుగులు చేయాల్సిన అవసరం ఉన్నప్పటికీ, ప్రత్యర్థి జట్టు మరింత మెరుగైన బ్యాటింగ్ ప్రదర్శించిందని తెలిపారు. ఉప్పల్‌ పిచ్‌ విషయాన్ని ప్రస్తావిస్తూ, ఇది కూడా మంచి వికెట్‌ అయినప్పటికీ, మొదటి మ్యాచ్‌లో ఆడిన పిచ్‌ ప్రపంచంలోనే అత్యుత్తమ పిచ్‌ అయితే, ఇది రెండవ ఉత్తమ పిచ్‌ అని అన్నారు. ఇన్నింగ్స్‌ చివరి వరకు ఓ బ్యాటర్‌ నిలదొక్కుకోవాలని, గత మ్యాచ్‌లో ఇషాన్‌ కిషన్‌ ఆ బాధ్యతను నెరవేర్చారని, కానీ ఈ మ్యాచ్‌లో ఆ అంశం మిస్‌ అయ్యిందని తెలిపారు.

ఉప్పల్‌ పిచ్‌పై ఇప్పటికే వివిధ విమర్శలు వస్తున్న నేపథ్యంలో, ఇది మంచి వికెట్‌ అని కమిన్స్‌ చెప్పడం ఆసక్తికరంగా మారింది. క్రికెట్‌లో బ్యాటింగ్‌-బౌలింగ్‌ల మధ్య సమతుల్యత అవసరమని పలువురు పేర్కొంటుండగా, కమిన్స్‌ వ్యాఖ్యలు మరో చర్చకు దారితీశాయి.