Video: మరో అంతరిక్షంలోకి సునీతా విలియమ్స్.. ఎప్పటి నుంచి ఎప్పటి వరకంటే?

వ్యోమగామిగా అనేక సాహసోపేతమైన ప్రయాణాలు చేసిన సునీతా విలియమ్స్ మరోసారి అంతరిక్షంలోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. తొమ్మిది నెలల పాటు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS) లో గడిపిన ఆమె, భూమికి తిరిగొచ్చిన వెంటనే మళ్లీ కొత్త ప్రయాణానికి సిద్ధమవుతున్నారు. శాస్త్ర పరిశోధనల కోసం సవాళ్లు ఎదుర్కొనడంలో వెనుకడుగు వేయనని, మానవాళికి ఉపయోగపడే పరిశోధనలు కొనసాగిస్తానని తెలిపారు. అంతరిక్షంలో గడిపిన అనుభవాలను పంచుకుంటూ, భవిష్యత్తు ప్రణాళికలను వెల్లడించారు.

ఈనెల 19న భూమికి తిరిగి వచ్చిన రెండు వారాల తర్వాత, సునీతా విలియమ్స్ మరియు బుచ్ విల్మోర్ తొలిసారి మీడియా ముందుకు వచ్చారు. 286 రోజుల పాటు అంతరిక్షంలో గడిపిన అనుభవాలను వారు వివరించారు. మళ్లీ అంతరిక్షంలోకి వెళతారా అన్న విలేకరి ప్రశ్నకు తడుముకోకుండా “అవును” అని సమాధానం ఇచ్చారు. ISS లో మరిన్ని పరిశోధనలు చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. మానవజాతి కోసం పరిశోధనలు చేయడం తమ ప్రధాన లక్ష్యమని, వ్యోమనౌకలో ఎదురైన సమస్యలు అతి చిన్నవని చెప్పారు. భూమికి తిరిగి వచ్చిన వెంటనే తన కుటుంబాన్ని కలుసుకున్నట్లు తెలిపారు. భూమి వాతావరణానికి అలవాటు పడుతున్నట్లు వివరించారు.

అంతరిక్షంలో 286 రోజులు గడిపిన ఆమె, తన తండ్రి మాతృభూమి గురించి ప్రత్యేకంగా మాట్లాడారు. హిమాలయాలను అంతరిక్షం నుండి చూసిన అనుభూతిని ఆమె వివరించారు. ముంబై, గుజరాత్ ఎలా కనిపించాయో చెప్పారు. హిమాలయ శ్రేణిని పై నుండి చూస్తే ప్రపంచంలోని అత్యంత అందమైన దృశ్యాలలో ఒకటిగా అనిపిస్తుందని తెలిపారు. నాసా వ్యోమగామిగా తిరిగి వెళ్లేందుకు సిద్దమవుతున్న సునీతా, మానవాళి పురోగతికి తన సాంకేతిక నైపుణ్యాన్ని ఉపయోగించనున్నారు.