ఇప్పుడు బంగారం కొనాలా? వద్దా?

గోల్డ్ లవర్స్ బయపడినట్లే బంగారం లక్ష రూపాయలు క్రాస్ అయిపోయింది. రాబోయే రోజుల్లో గోల్డ్ రేటు మరింత పెరుగుతుందనే అంచనాల నేపథ్యంలో, అసలు ఇప్పుడున్న పరిస్థితుల్లో బంగారం కొనడం ఉత్తమమా లేక మరికొన్ని రోజులు వెయిట్ చేస్తే మంచిదా? అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. పెట్టుబడి లక్ష్యంతో బంగారం కొనాలని చూసేవాళ్లు మాత్రం ఎదురుచూడడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఏవైనా శుభకార్యాలు పెట్టుకొని బంగారం కొనాలనుకునేవాళ్లు అయితే.. తక్షణం బంగారం కొనడం ఉత్తమం అంటున్నారు.

రాబోయే రోజుల్లో బంగారం మరో 10వేల రూపాయలు పెరగొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. మరి భవిష్యత్తులో బంగారం ధరలు పెరుగుతాయా.. ఇవే రేట్లతో స్థిరీకరణ
పొందుతాయా అంటే.. రాబోయే రోజుల్లో పసిడి ధరలు తగ్గొచ్చని చెబుతున్నారు.

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాల వల్ల.. ప్రస్తుతం ప్రపంచ మార్కెట్లలో అనిశ్చితి కొనసాగుతోంది.. కాబట్టి కొన్నాళ్లు వెయిట్ చేస్తే గోల్ రేటు కచ్చితంగా తగ్గే
అవకాశం ఉందని అంటున్నారు. ప్రస్తుతం అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఇండియాలో పర్యటిస్తున్నారు. మరోవైపు భారత అధికారుల బృందం అమెరికా అధికారులతో సుంకాలపైన చర్చించడంతో.. అమెరికా నుంచి సానుకూల సంకేతాలు వస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే కనుక నిజమైతే, బంగారం ధర 90వేల రూపాయలకు దిగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. పన్నుల యుద్ధం కొలిక్కి వచ్చేంతవరకు పసిడి ధరలపై ఎవరూ ఏం చెప్పలేరని నిపుణులు చెబుతున్నారు.

ప్రస్తుతం ట్రంప్‌నకు వ్యతిరేకంగా అమెరికన్లు రోడ్డెక్కుతున్నారని..డొనాల్డ్ ట్రంప్ కాస్త చల్లారితే, ప్రపంచవ్యాప్తంగా వాణిజ్య పరిస్థితులు కూడా చక్కబడతాయని విశ్లేషిస్తున్నారు. నిజానికి ధరలు తగ్గినా, పెరిగినా వస్తురూపంలో బంగారం కొనడం అనేది డెడ్ ఇన్వెస్టిమెంట్ అని కొందరు చెబుతుంటే.. బంగారం ఉన్నవారే భవిష్యత్తులో రాజ్యమేలుతారని మరికొంతమంది నిపుణులు చెబుతున్నారు . ఫంక్షన్లకు వేసుకెళ్లడానికి లేదా గోల్డ్ లోన్ కోసం మాత్రమే పనికొస్తుంది. ప్రస్తుతానికైతే మధ్యతరగతి జనం బంగారం షాపులకు పూర్తిగా దూరమయ్యారని.. తెలుగు రాష్ట్రాల్లో సేల్స్ తగ్గాయని బంగారం షాపుల యజమానులు గగ్గోలుపెడుతున్నారు.