దీపావళి పర్వదినం సందర్భంగా దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఆయన దేశ ప్రజలను ఉద్దేశించి రాసిన లేఖలో ఆపరేషన్ సింధూర్ గురించి ప్రస్తావిస్తూ, “భారత ధర్మాన్ని కాపాడటమే కాకుండా పహల్గాంలో జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకున్నాం” అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆపరేషన్ సింధూర్కి శ్రీరాముడే స్ఫూర్తి అని ఆయన చెప్పారు.
అయోధ్యలో రామాలయ నిర్మాణం తర్వాత ఇది రెండో దీపావళి అని మోదీ తెలిపారు. ధర్మాన్ని కాపాడాలని శ్రీరాముడు మనకు బోధించాడని, అన్యాయాన్ని ఎదుర్కొనే ధైర్యాన్ని ఇస్తాడని అన్నారు. మావోయిస్టుల నుంచి విముక్తి పొందిన అనేక జిల్లాల్లో ఈసారి దీపావళి వెలుగులు మరింత విస్తరించాయని చెప్పారు. హింసా మార్గాన్ని విడిచి రాజ్యాంగంపై విశ్వాసం పెంచుకుంటున్న ప్రజలతో దేశం ముందుకు సాగుతోందని వ్యాఖ్యానించారు.
జీఎస్టీ రేట్ల తగ్గింపుతో ప్రజలకు లాభం చేకూరుతుందని ప్రధాని పేర్కొన్నారు. స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహించాలని, అన్ని భాషలను గౌరవించాలని, పరిశుభ్రతను పాటించాలని పౌరులను కోరారు. ఆహారంలో నూనె వాడకాన్ని తగ్గించి యోగాను ఆచరించాలని సూచించారు. ఈ ప్రయత్నాలు వికసిత్ భారత్ వైపు దేశాన్ని నడిపిస్తాయని మోదీ నమ్మకం వ్యక్తం చేశారు.