తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల. రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ శాసనసభ నియోజకవర్గం ఉప ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మక పోరాటంగా తీసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్‌ను గెలిపించే బాధ్యతను ఆయనే స్వయంగా భుజాన వేసుకున్నారు. ఈ ఉప ఎన్నికల ఫలితం కాంగ్రెస్ ప్రభుత్వ 22 నెలల పాలనకు కొలమానంగా మారడంతో పాటు, భవిష్యత్తులో జరగబోయే జీహెచ్ఎంసీ ఎన్నికలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉండటంతో సీఎం ఈ నిర్ణయం తీసుకున్నారు.
ముఖ్యమంత్రి పర్యటన షెడ్యూల్:
రేవంత్ రెడ్డి ఈ ఎన్నికల ప్రచారంలోకి స్వయంగా దిగుతున్నారు. ఈ నెల 28న యూసుఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్స్‌లో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్, 24 కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జరగనున్న అభినందన సభలో సీఎం ప్రసంగించనున్నారు. ఈ సభలో ఆయనతో పాటు మంత్రి తుమ్మల నాగేశ్వరరావునూ సన్మానించనున్నారు.
ఈ అభినందన సభతో పాటు, సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల 30, 31 తేదీల్లోను, అలాగే నవంబర్ 4, 5 తేదీల్లోను నియోజకవర్గంలో రోడ్‌షోలు నిర్వహించనున్నారు. ఇక ఈ ప్రచార కార్యక్రమాల మధ్యలో ఆయన బీహార్ ఎన్నికల ప్రచారానికి కూడా వెళ్లనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. కాగా, ముఖ్యమంత్రి స్వయంగా ప్రచారంలో పాల్గొననుండటంతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల రాజకీయం మరింత వేడెక్కింది.








































