గుర్తు తెలియని నంబర్ల నుంచి వచ్చే ఫోన్ కాల్స్ వల్ల తరచుగా ప్రజలు మోసపోతూ లేదా అసౌకర్యానికి గురవుతున్నారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం కొత్త సేవను ప్రారంభించేందుకు సిద్ధమైంది. థర్డ్ పార్టీ యాప్‌లు అయిన ట్రూకాలర్, ఐడీ యాప్‌ల అవసరం లేకుండా, అధికారికంగా కాలింగ్ నేమ్ ప్రజెంటేషన్ (CNAP) అనే సేవను డిపార్ట్మెంట్ ఆఫ్ టెలీకమ్యూనికేషన్స్ (DoT) ప్రారంభించనుంది.
ఈ సేవ ద్వారా ఎవరికైనా ఇన్కమింగ్ కాల్ వచ్చినప్పుడు, ఆ ఫోన్ నంబరు ఎవరి పేరుతో రిజిస్టర్ అయి ఉందో ఆ పేరు నేరుగా మొబైల్ స్క్రీన్‌పై కనిపిస్తుంది. ఇలా ఉండటం వల్ల మోసపూరిత కాల్స్, స్పామ్ నంబర్లను సులభంగా గుర్తించడం సాధ్యమవుతుంది. సీఎన్ఏపీ సేవలను ఉపయోగించాలా వద్దా అన్నది వినియోగదారుల ఎంపికగా ఉంటుంది; సేవలు వద్దని కోరేవారు తమ టెలికాం సంస్థను సంప్రదించి నిలిపివేయవచ్చు.
డీఓటీ ప్రతిపాదనకు ట్రాయ్ ఇప్పటికే ఆమోదం తెలిపింది. దేశంలోని కొన్ని ఎంపిక నగరాల్లో సీఎన్ఏపీని ప్రయోగాత్మకంగా పరీక్షించగా, కొన్ని సాంకేతిక సమస్యలను గుర్తించి పరిష్కరించారు. ప్రస్తుతం జియో, ఎయిర్టెల్, వోడాఫోన్ ఐడియా సంస్థలు ఈ సేవల అమలుకు సిద్ధమవుతున్నాయి.
2026 మార్చి 31 నాటికి దేశవ్యాప్తంగా సీఎన్ఏపీ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం హరియాణాలో జియో, వోడాఫోన్ సంస్థలు ఈ సేవలను ట్రయల్ రన్‌గా అందిస్తున్నాయి. ఈ చర్యతో మొబైల్ వినియోగదారులకు భద్రత, పారదర్శకత మరింతగా పెరగనుంది.




































