బీఆర్‌ఎస్‌-బీజేపీల మధ్య చీకటి ఒప్పందం – సీఎం రేవంత్‌ రెడ్డి

Jubilee Hills Bypoll CM Revanth Reddy Alleges Secret Deal Between BRS and BJP

బీఆర్‌ఎస్‌-బీజేపీల మధ్య చీకటి ఒప్పందం కుదిరిందని, వారి బంధం ఫెవికాల్‌ బంధం లాంటిదని తీవ్ర ఆరోపణలు చేశారు తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం రాత్రి ఆయన రహమత్ నగర్‌లో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్, కేసీఆర్ కుటుంబంపై, కాళేశ్వరం ప్రాజెక్టు కేసుపై సంచలన ఆరోపణలు చేస్తూ బీజేపీకి సవాల్ విసిరారు. కాగా, ముఖ్యమంత్రి ప్రసంగం జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో కీలకాంశంగా నిలిచింది.

కాళేశ్వరం ప్రాజెక్టు కేసు ఏమైంది?

  • కాళేశ్వరం కేసు: కేంద్ర మంత్రికి కేసీఆర్‌కు లొంగకపోతే, రెండు పార్టీల మధ్య ఒప్పందం లేకపోతే, జూబ్లీహిల్స్ పోలింగ్ తేదీలోగా కాళేశ్వరం కేసులో సీబీఐ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి, కేసీఆర్‌, హరీశ్‌లను అరెస్టు చేయాలని సవాల్ విసిరారు.
  • గవర్నర్‌ వద్ద ఫైల్: ఫార్ములా-ఈ కారు రేసు వ్యవహారంలో కేటీఆర్‌ రూ. 50 కోట్లు ఎలక్టోరల్ బాండ్ల రూపంలో వసూలు చేశారని, దీనిపై ఏసీబీ కేసు కట్టి కేటీఆర్‌ను అరెస్టు చేయడానికి అనుమతి కోరుతూ పంపిన ఫైల్ రెండు నెలలుగా గవర్నర్‌ వద్ద ఆగిపోయిందని ప్రస్తావించారు. కేటీఆర్‌ను అరెస్టు చేయడానికి అనుమతి ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు.
  • విలీనం కుట్ర: బీఆర్‌ఎస్‌ను గెలిపించి, ఆత్మహత్య చేసుకొని ఆ తర్వాత బీజేపీలో విలీనం చేసే కుట్ర జరుగుతోందని ఆయన ఆరోపించారు. కారు స్టీరింగ్ మోదీ చేతిలో ఉందని కేటీఆర్‌ సోదరి చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు.

బీజేపీ నేతల ఆరోపణలు ఇప్పుడు ఏమయ్యాయి?

గతంలో రాష్ట్రంలో పర్యటనకు వచ్చినప్పుడు ప్రధాని మోదీ, అమిత్ షాలు కాళేశ్వరం ప్రాజెక్టు బీఆర్‌ఎస్‌కు ఏటీఎంగా మారిందని, లక్షల కోట్లు కొల్లగొట్టారని విమర్శించిన విషయాన్ని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు.

జ్యూడిషియల్ కమిషన్: కాళేశ్వరం కట్టడం, కూలడం మూడేళ్లలో జరిగిపోయిందని, లక్ష కోట్లు గోదావరిలో కలిశాయని అన్నారు. దీనిపై వేసిన జ్యూడిషియల్ కమిషన్ కేసీఆర్‌, హరీశ్‌లు దోషులని నివేదిక ఇచ్చిందని, దీనిపై అసెంబ్లీలో చర్చించి సీబీఐకి కేసు అప్పగించామని తెలిపారు.
కేసు అప్పగింత: సెప్టెంబరు 1న కేసును కేంద్రానికి అప్పగించినా, అంతకుముందు 48 గంటల్లో అరెస్టు చేస్తామని చెప్పిన కిషన్ రెడ్డి, ఇప్పుడు ఎందుకు అరెస్టు చేయట్లేదు అని ప్రశ్నించారు.

సంప్రదాయాన్ని తుంగలో తొక్కారు..

సంప్రదాయాన్ని తుంగలో తొక్కిందే బీఆర్‌ఎస్‌ అని రేవంత్ రెడ్డి అన్నారు. గతంలో ఎమ్మెల్యేలు మరణిస్తే వారి కుటుంబ సభ్యులకు ఏకగ్రీవంగా టికెట్ ఇచ్చే సంప్రదాయాన్ని కేసీఆర్ ఉల్లంఘించారని గుర్తు చేశారు.

  • పీజేఆర్ కుటుంబం: పీజేఆర్ కుటుంబంపై పోటీ పెట్టినందుకు కేటీఆర్ ముక్కు నేలకు రాయాలని డిమాండ్ చేశారు.
  • చెల్లెలి అంశం: తండ్రి ఆస్తిలో వాటా ఇవ్వాల్సి వస్తుందని సొంత చెల్లెలిని ఇంట్లో నుంచి గెంటేశారని కేటీఆర్‌పై ఆరోపణలు చేశారు. అలాంటి వ్యక్తి మహిళా సెంటిమెంట్ గురించి మాట్లాడటం ఏంటని దుయ్యబట్టారు.
  • హైదరాబాద్ అభివృద్ధి: పదేళ్లు మున్సిపల్ మంత్రిగా ఉన్న కేటీఆర్‌, గల్లీలకు వచ్చి చెత్త, మట్టి గురించి మాట్లాడుతున్నారని, ఈ సర్వ దరిద్రాలకు ఆయనే కారణం కాదా? అని ప్రశ్నించారు.
  • ఫామ్‌హౌస్‌లు: కేసీఆర్ కుటుంబ సభ్యులు కేటీఆర్‌, కేసీఆర్‌, హరీశ్‌రావు, కవిత వందల ఎకరాల్లో ఫామ్‌హౌజ్‌లు కట్టుకున్నారని, ఈ సొమ్ము ఎక్కడి నుంచి వచ్చిందని ముఖ్యమంత్రి ప్రశ్నించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here