రాష్ట్రంలో కేజీ – పీజీ స్టూడెంట్ ట్రాకింగ్ సిస్టం అమలుకు మంత్రి నారా లోకేష్ ఆదేశాలు

Minister Nara Lokesh Suggests Implementing KG-to-PG Student Tracking System in AP

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నత విద్య, ఇంటర్మీడియట్ విద్యకు సంబంధించి ముఖ్యమైన సంస్కరణలు చేపట్టాలని, విద్యార్థులకు ఉపాధి అవకాశాలను పెంచాలని అధికారులను ఆదేశించారు మంత్రి నారా లోకేష్. ఈ మేరకు ఆయన బుధవారం గుంటూరు జిల్లా ఉండవల్లి నివాసంలో సంబంధిత అధికారులతో కీలక సమీక్ష నిర్వహించారు.

యూనివర్సిటీల్లో పరిపాలనపై కీలక నిర్ణయాలు:

యూనిఫైడ్ యాక్ట్: ప్రభుత్వ యూనివర్సిటీల్లో పరిపాలనకు సంబంధించి యూనిఫైడ్ యాక్ట్ (Unified Act) ను రూపొందించాలని అధికారులను మంత్రి ఆదేశించారు.

ఉపాధి లేమిపై ఆందోళన: ఇంజనీరింగ్ విద్యార్థులు నాలుగేళ్లు చదివినా ఉద్యోగాలు లభించడం లేదని, కానీ అమీర్‌పేటలో కేవలం నాలుగు నెలల కోచింగ్‌తో ఉద్యోగాలు సాధిస్తున్నారని లోకేష్ ప్రస్తావించారు.

పాఠ్యప్రణాళిక ప్రక్షాళన: ఈ నేపథ్యంలో, ఉన్నత విద్య పాఠ్యప్రణాళికను (Curriculum) వెంటనే ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.

ఉద్యోగాలకు అనుసంధానం, నియామకాలపై దృష్టి:

పరిశ్రమలతో అనుసంధానం: ఐటిఐలు మరియు యూనివర్సిటీలను నవంబర్ లోగా పరిశ్రమలతో అనుసంధానం చేసేందుకు చర్యలు చేపట్టాలని మంత్రి ఆదేశించారు.

నైపుణ్యం పోర్టల్: ప్రైవేటు కాలేజీలను కూడా నైపుణ్యం పోర్టల్‌తో అనుసంధానం చేసి, ప్రాంగణ నియామకాలకు (Campus Placements) గ్యారంటీ ఇవ్వాలని సూచించారు.

నియామకాలపై ఆరా: యూనివర్సిటీలు, ఐటిఐ, ట్రిపుల్ ఐటీల్లో 100 శాతం ప్రాంగణ నియామకాలకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

అధ్యాపక పోస్టులు: యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టుల భర్తీపై కూడా సమావేశంలో చర్చించారు.

ట్రాకింగ్, ర్యాంకింగ్స్ మెరుగుదల:

స్టూడెంట్ ట్రాకింగ్: కేజీ నుంచి పీజీ వరకు స్టూడెంట్ ట్రాకింగ్ వ్యవస్థను సమర్థంగా రూపొందించాలని మంత్రి సూచించారు.

ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్: ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్ మెరుగుదలకు వెంటనే చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

ఫీడ్‌బ్యాక్ మెకానిజం: అన్ని యూనివర్సిటీల్లో స్టూడెంట్ ఫీడ్ బ్యాక్ మెకానిజం ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.

ముఖ ఆధారిత హాజరు: కళాశాలల్లో తప్పనిసరిగా ముఖ ఆధారిత హాజరు (Face Recognition Attendance) అమలు చేయాలని మంత్రి అభిప్రాయపడ్డారు.

ఇంటర్మీడియట్ విద్యపై ఆదేశాలు

ఇంటర్మీడియట్ విద్యపై అధికారులతో సమీక్షించిన మంత్రి, ఉత్తీర్ణతా శాతం పెంపునకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అధికారులు ఇంటర్లో చేపట్టిన సంస్కరణలను మంత్రికి వివరించారు. వృత్తి విద్య కోర్సులను అభ్యసిస్తున్న విద్యార్థులను కూడా ట్రాకింగ్ చేయాలని, ప్రైవేటు కాలేజీలకు అనుమతులపై కాలపరిమితి ఉండాలని లోకేష్ స్పష్టం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here